సైబర్ మోసాలకు గురవుతున్న వారిలో రిటైర్డ్ ఉద్యోగులు, వృద్ధులు గణనీయంగా ఉన్నారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ వర్గాల్లో సైబర్ నేరాలపై అవగాహన పెంచేందుకు ‘సురక్షా కా తిరంగ’ కార్యక్రమం ద్వారా ప్రత్యేకంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన సైబర్ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త విధానాన్ని ఎంచుకుని ప్రజలను మోసం చేస్తున్నారని డీజీపీ పేర్కొన్నారు. ఇప్పటివరకు సుమారు 40 రకాల సైబర్ నేరాల విధానాలను గుర్తించినట్లు తెలిపారు.
తెలియని వ్యక్తుల నుంచి వచ్చే మెసేజ్‌లు, లింకుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటిని పరిశీలించకుండా క్లిక్ చేయడం వల్ల ఖాతాల్లోని నగదు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. పెట్టుబడి పెడితే భారీగా లాభాలు వస్తాయని ఎవరైనా హామీ ఇస్తే వెంటనే నమ్మొద్దని డీజీపీ సూచించారు.
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశను సైబర్ నేరగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని చెప్పారు. అసాధారణంగా అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్ల వెనుక మోసం ఉండే అవకాశాన్ని గుర్తించాలన్నారు.
డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే లావాదేవీలు జరపాలని ప్రజలకు సూచించారు.
