నగరంలోని నాలుగో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరుస చైన్ స్నాచింగ్ కలకలం రేపాయి. నగర శివారులోని క్యాన్సర్ ఆసుపత్రి ప్రాంతంలో ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును అపహరించేందుకు ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చారు.
అయితే అప్రమత్తమైన మహిళ వెంటనే తన మెడలోని చైన్‌ను గట్టిగా పట్టుకోవడంతో దుండగుల ప్రయత్నం విఫలమైంది. ఆ తర్వాత తిరుమల థియేటర్ చౌరస్తా వద్ద నడుచుకుంటూ వెళ్తున్న మరో మహిళను ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వెంబడించి, ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకొని పరారయ్యారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దుండగుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.ఈ రెండు ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
