ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్) ముందుకొచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులతో నిర్మాణ్ ఆర్గనైజేషన్ సహకారంతో రూ.65 లక్షల విలువైన వైద్య పరికరాలను ఆసుపత్రికి సమకూర్చింది.
వీటిని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా. కృష్ణమోహన్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎల్. రాములు గురువారం ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్లలో ప్రారంభించారు.ఈ పరికరాల్లో మూడు వెంటిలేటర్లు, మూడు బబుల్ సీపాప్ పరికరాలు, ఒక సి-ఆర్మ్ యంత్రం, ఐదు సీఆర్ క్యాసెట్లు, పది సిరంజీ పంపులు, ఆరు ప్రసవ పట్టికలు, రెండు కార్డియోటోకోగ్రఫీ (సీటీజీ) యంత్రాలు ఉన్నాయి.
వీటి అందుబాటుతో శస్త్రచికిత్సలు, ప్రసూతి సేవలు, నవజాత శిశువుల సంరక్షణతో పాటు అత్యవసర వైద్య సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అవకాశం కలగనుంది. జీజీహెచ్ మాజీ సూపరింటెండెంట్, పీడియాట్రిక్స్ ప్రొఫెసర్ డా. పి. శ్రీనివాస్, జనరల్ మెడిసిన్ విభాగాధిపతి డా. జలగం తిరుపతిరావు పర్యవేక్షణలో ఈ పరికరాలు సీఎస్ఆర్ పథకం కింద మంజూరయ్యాయి.
డా. శ్రీనివాస్ సూపరింటెండెంట్గా పనిచేసిన సమయంలో ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టగా, డా. తిరుపతిరావు పర్యవేక్షణలో పరికరాల సమకూర్పు పూర్తయింది.ఈ కార్యక్రమంలో ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డా. రవి కిరణ్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి డా. శ్రీకాంత్, ప్రసూతి, స్త్రీరోగ విభాగాధిపతి డా. లక్ష్మీ ప్రసన్న, ఈఎన్టీ విభాగాధిపతి డా. సునీల్, డా. అరుణ రేఖ, అనస్థీషియా విభాగాధిపతి డా. రవి నాగ ప్రసాద్, డెర్మటాలజీ విభాగాధిపతి డా. రమణ మోహన్, డా. శ్రీనివాస్ రెడ్డి, నర్సింగ్ సూపరింటెండెంట్ ఎస్. చంద్రకళ, నర్సింగ్ అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధికి సహకరించిన ఐఓసీఎల్, నిర్మాణ్ ఆర్గనైజేషన్కు ఆసుపత్రి యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.
