HomePOLITICAL NEWSఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా

ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా

  • నాపై ఆధారాలతో నిరూపించాలి.. నిజనిర్ధారణ కమిటీతో విచారణ జరిపించాలి
  • రాజకీయాలను వ్యాపారంతో ముడిపెట్టి బురదజల్లడం సరికాదు
  • రైస్‌మిల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్‌రెడ్డి

తనపై చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని రైస్‌మిల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్డీ మోహన్‌రెడ్డి సవాల్‌ చేశారు.

ఆరోపణల్లో వాస్తవం ఉంటే కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌ స్థాయిలో విచారణ జరిపి తనపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని, అవి నిరాధారమని తేలితే ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాజకీయ విభేదాలను వ్యక్తిగత ఆరోపణలకు దారితీయడం ప్రజాస్వామ్య పద్ధతి కాదన్నారు.తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, ప్రస్తుతం రైస్‌మిల్‌ నిర్వహిస్తూ రైతుల సమస్యలపై పోరాడుతున్నానని మోహన్‌రెడ్డి తెలిపారు.

రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించాలంటూ గతంలో పోరాటాలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తన వ్యక్తిగత జీవితం, వ్యాపార కార్యకలాపాల గురించి పూర్తిగా తెలుసుకోకుండా సామాజిక మాధ్యమాల్లో కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

రాజకీయాలను వ్యాపారంతో ముడిపెట్టి తన ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు.తనపై వస్తున్న ఆరోపణలపై జిల్లా కలెక్టర్, పోలీస్‌ కమిషనర్‌ ఆధ్వర్యంలో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.

ఆరోపణలు నిజమైతే తనపై చర్యలు తీసుకోవాలని, నిరాధారమని తేలితే ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు కూడా తనపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.

ఇప్పటివరకు రాజకీయాలను పెద్దగా పట్టించుకోలేదని, ఇకపై రాజకీయంగా సత్తా చూపేందుకు సిద్ధంగా ఉన్నానని మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. 2023 ఎన్నికల సమయంలో వివిధ పార్టీల నాయకులు ఇచ్చిన హామీలు, ఎన్నికల అఫిడవిట్లు, అభివృద్ధి పనులపై ప్రజలకు పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్రంలో ఎక్కడైనా ఉపఎన్నికలు జరిగే పరిస్థితి వస్తే బీజేపీ తన సత్తాను నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉందన్నారు. ధాన్యానికి మద్దతు ధర విషయంలోనూ ప్రభుత్వాలు రైతులకు స్పష్టత ఇవ్వాలని కోరారు.

తెలంగాణలో ధాన్యానికి రూ.2,460 మద్దతు ధర ఇస్తుండగా, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రూ.3,160గా ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో రైస్‌మిల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు దయానందగుప్తా, మర్చంట్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు లాబిశెట్టి శ్రీనివాస్, గోశాల అధ్యక్షుడు పవన్‌ కేడియా తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments