మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నిజామాబాద్ ఫాస్ట్ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు కాలే పండు రంగా కు రూ.5 వేల జరిమానా కూడా విధించింది.
ఫాస్ట్ట్రాక్ స్పెషల్ జడ్జి దుర్గాప్రసాద్ ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 2021 మార్చి 18న బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై కాలే పండు రంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సంబంధిత ఆధారాలు, సాక్ష్యాలను న్యాయస్థానంలో సమర్పించారు.
వాటిని పరిశీలించిన న్యాయమూర్తి నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ శిక్ష విధించారు.ఐపీసీ సెక్షన్ 376ఏబీ, పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఎం)తో పాటు 6 ప్రకారం 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. పోక్సో చట్టం కింద రూ.5 వేల జరిమానా కూడా విధించింది.
