గ్రామీణ ప్రాంతాల్లో వంట గ్యాస్ సిలిండర్ల కష్టాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఒకప్పుడు ఇంటి ముంగిటకే వచ్చే సిలిండర్ కోసం ఇప్పుడు కిలోమీటర్ల మేర పరుగులు తీయాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రభుత్వం సరఫరా సాఫీగా ఉందని చెబుతున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం ‘గ్యాస్’ కొరత సామాన్యుడిని బెంబేలెత్తిస్తోంది.
సిలిండర్ లోడుతో వాహనం గ్రామంలోకి రాకముందే వినియోగదారులు రోడ్లపైకి చేరుకుని పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న యుద్ధ వాతావరణం, గ్యాస్ ధరలు మరింత పెరుగుతాయనే ప్రచారం గ్రామీణ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.
దీంతో అవసరమున్నా లేకపోయినా, బుకింగ్ చేసుకున్న వారితో పాటు అదనపు సిలిండర్లను నిల్వ చేసుకునేందుకు ప్రజలు పోటీ పడుతున్నారు. గతంలో వీధుల్లోకి వాహనం వచ్చినా పెద్దగా పట్టించుకోని జనం, ఇప్పుడు వాహనం రాగానే ఎగబడుతుండటంతో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
వారానికి ఒకటి రెండు సార్లు వచ్చే వాహనాల్లోని సిలిండర్లు నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిపోతున్నాయి. డిజిటల్ చెల్లింపులు, ఓటీపీ విధానం అమల్లో ఉన్నప్పటికీ.. గ్యాస్ పొందడం వినియోగదారులకు గగనమైపోతోంది. బుకింగ్ చేసుకుని రోజుల తరబడి ఎదురుచూస్తున్నా సిలిండర్ చేతికి అందడం లేదు.
‘అన్ని కంపెనీల పరిస్థితి ఇదే.. మా దగ్గర స్టాక్ లేదు’ అంటూ ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్న సమాధానాలు ప్రజల్లో అసహనాన్ని పెంచుతున్నాయి. ఓవైపు గ్యాస్ కొరతతో ప్రజలు అల్లాడుతుంటే, మరోవైపు గ్యాస్ ఏజెన్సీల డెలివరీ బాయ్స్ తీరు మరీ దారుణంగా తయారైంది. సిలిండర్ ఎప్పుడు వస్తుంది ఎక్కడ దొరుకుతుంది అనే కనీస సమాచారం ఇవ్వకుండా వినియోగదారులను ముప్పతిప్పలు పెడుతున్నారు.
అడిగితే దురుసుగా సమాధానం చెప్పడం, అసలు సమాచారమే లేదన్నట్లు వ్యవహరించడంపై గ్రామీణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా క్రమం తప్పకుండా గ్యాస్ సరఫరా చేయాలి. ఏజెన్సీల నిర్వాహకులు డెలివరీ బాయ్స్‌ను అదుపులో ఉంచాలి. కృత్రిమ కొరత సృష్టించే వారిపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలనీ కోరుతున్నారు.
