ప్రేమ వ్యవహారంలో తలెత్తిన మనస్పర్థలు ఓ యువకుడి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. నిజామాబాద్ నగరానికి చెందిన యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. రైల్వే ఎస్‌హెచ్‌ఓ హెచ్. సాయిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం…
నిజామాబాద్ నగరంలోని హమాల్‌వాడి ప్రాంతానికి చెందిన దోల అనిల్ (29) వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడనీ అన్నారు. ఇతడు ఓ యువతిని గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడనీ అయితే, వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా ప్రేమ విషయంలో గొడవలు జరుగుతున్నాయనీ పేర్కొన్నారు.
ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారడంతో నిజామాబాద్ మూడవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో కౌన్సిలింగ్ కూడా నిర్వహించినట్లు తెలిపారు. అయినప్పటికీ మనస్తాపానికి గురైన అనిల్, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం.ఈ క్రమంలోనే గురువారం ఉదయం నిజామాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో కరీంనగర్ డెమో రైలు కింద పడి అనిల్ బలవన్మరణానికి పాల్పడ్డాడన్నారు.
మృతుడి కుటుంబ సభ్యులను విచారించగా.. ప్రేమ వ్యవహారంలో జరుగుతున్న గొడవలను మనసులో పెట్టుకుని, తీవ్ర మనస్తాపంతోనే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి లక్ష్మీపతి పోలీసులకు తెలిపారనీ అన్నారు.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు, కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే ఎస్ఐ సాయి రెడ్డి తెలిపారు.
