జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో అలజడులు జరగకుండా ముందస్తుగా 163 BNSS (పాత సెక్షన్ 144 CrPC విధిస్తున్నట్లు జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని మొత్తం 27 పరీక్షా కేంద్రాల వద్ద ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని సీపీ తెలిపారు.పరీక్షలు జరిగే రోజుల్లో (ఏప్రిల్ 20 నుంచి 27 వరకు) ఉదయం 7:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి.
కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరు అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు గుంపులుగా చేరడాన్ని నిషేధించారు.పరీక్షా సమయాల్లో (ఉదయం 9:00 – 12:00, మధ్యాహ్నం 2:30 – 5:30) స్థానికంగా ఉన్న జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ కేఫ్‌లు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని యజమానులను ఆదేశించారు.
పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ పరికరాలు లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకురావడంపై పూర్తి నిషేధం విధించారు. పరీక్షల నిర్వహణకు విఘాతం కలిగించేలా వ్యవహరించే అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచడానికి ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ వివరించారు.
ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి విజయం సాధించాలని కోరుతూ సీపీ సాయి చైతన్య వారికి శుభాకాంక్షలు (ఆల్ ది బెస్ట్) తెలియజేశారు.
