Thursday, April 16, 2026
HomeCRIMEప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. రోడ్డుపై అప్రమత్తత అవశ్యం...కోవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ...ఏడాదిలో...

ప్రాణాలు తీస్తున్న నిర్లక్ష్యం.. రోడ్డుపై అప్రమత్తత అవశ్యం…కోవిడ్ మరణాల కంటే రోడ్డు ప్రమాద మరణాలే ఎక్కువ…ఏడాదిలో జిల్లాలో 302 మంది బలి…గోల్డెన్ అవర్‌లో ప్రాణాలు కాపాడితే రూ. 25 వేల పారితోషికం…సీపీ సాయి చైతన్య వెల్లడి..

ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు అవగాహన**”రోడ్డు ప్రమాదాలు అనుకోకుండా జరిగేవి కావు.. మన చిన్నపాటి నిర్లక్ష్యం వల్ల కొనితెచ్చుకునేవి. జిల్లాలో గతేడాది కోవిడ్ కంటే రోడ్డు ప్రమాదాల వల్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరం” అని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ’99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా.. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా నిర్వహిస్తున్న అరైవ్ అలైవ్ వారోత్సవాలు గురువారం నాలుగో రోజుకు చేరుకున్నాయి. నగరంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఆటో, అంబులెన్స్ డ్రైవర్లకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జిల్లాలో ప్రమాదాల తీవ్రతను వివరించారు. కరోనా మహమ్మారి సమయంలో జిల్లాలో సుమారు 200 మంది మృతి చెందగా.. ఒక్క 2025 సంవత్సరంలోనే రోడ్డు ప్రమాదాల కారణంగా 302 మంది మరణించారని గణాంకాలతో సహా వెల్లడించారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్‌ఫోన్ మాట్లాడటం వంటి అలవాట్లు ప్రాణాంతకంగా మారుతున్నాయని హెచ్చరించారు. ప్రమాదం జరిగిన వెంటనే ‘గోల్డెన్ అవర్’ (మొదటి గంట)లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడే వ్యక్తులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని సీపీ తెలిపారు. ‘సహార్వీర్’ పథకం కింద ఇలాంటి వారికి రూ. 25,000 పారితోషికం అందజేస్తామని చెప్పారు. ప్రతి డ్రైవర్ బాధ్యతగా వ్యవహరించి ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ సంస్కృతిని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలతో కూడిన పాంప్లెట్లు, పోస్టర్లను అతిథులతో కలిసి సీపీ ఆవిష్కరించారు. డ్రైవర్లందరితో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి ఉమామహేశ్వరరావు, ఇన్చార్జి ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఆర్‌ఐ వినోద్, టౌన్ వన్ ఎస్‌హెచ్‌ఓ రఘుపతి, ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు, ఎంవీఐ కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!