రాజకీయ వేదిక అనేది ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేసే పోరాటమని, అది డబ్బుతో కొనుగోలు చేసే వ్యాపారం కాదని తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ స్పష్టం చేశారు. సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన సమితి ప్లీనరీ సన్నాహక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత మొదటిసారి జిల్లాకు విచ్చేసిన కోదండరామ్ కు జిల్లా కమిటీ ఘనంగా సన్మానం చేసింది.జిల్లాలో తెలంగాణ జన సమితిని క్షేత్రస్థాయి నుండి ఎలా బలోపేతం చేయాలనే అంశంపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై ఆయన ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో తెలంగాణ జన సమితి పోషించిన కీలక పాత్రను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, కార్యకర్తల కృషిని కొనియాడారు.నిజామాబాద్ జిల్లాలో నెలకొన్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణను వివరించారు.
వచ్చే మే 12వ తేదీన జరగనున్న ప్లీనరీ సమావేశానికి జిల్లా నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ జన సమితి ఎప్పుడూ ప్రజల పక్షానే ఉంటుంది. గత ప్రభుత్వంపై నిజామాబాద్ జిల్లా యూనిట్ జరిపిన పోరాటం అభినందనీయం అని కొనియాడారు.
జిల్లా అధ్యక్షుడిగా మహమ్మద్ జాఫర్ ఎన్నిక**ఈ సమావేశంలో భాగంగా నిజామాబాద్ జిల్లా తెలంగాణ జన సమితి అధ్యక్షులుగా మహమ్మద్ జాఫర్ ను, జనరల్ సెక్రెటరీగా మర్రి కిరణ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు జాఫర్ కృతజ్ఞతలు తెలుపుతూ, జిల్లాలో పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.
