Monday, May 4, 2026
HomeCRIMEసరిహద్దుల్లో అలర్ట్.. పక్కాగా భద్రత! నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలి బ్యాంకర్లు, గోల్డ్ మర్చెంట్లతో పోలీస్...

సరిహద్దుల్లో అలర్ట్.. పక్కాగా భద్రత! నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలి బ్యాంకర్లు, గోల్డ్ మర్చెంట్లతో పోలీస్ కమిషనర్ భేటీ

జిల్లాలో నేరాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ పోలీసులతో చేతులు కలపాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య,పిలుపు నిచ్చారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలో జరిగిన భారీ చోరీ నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

సోమవారం కమిషనరేట్ కార్యాలయంలో బ్యాంకు మేనేజర్లు, బంగారు దుకాణాల యజమానులు, ఏటీఎం సెంటర్ల నిర్వాహకులు, ఫైనాన్షియర్లతో సీపీ సమన్వయ సమావేశం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా గుండా వెళ్లే 44వ జాతీయ రహదారి, పక్కనే ఉన్న మహారాష్ట్ర సరిహద్దుల దృష్ట్యా భద్రతను ఏమాత్రం విస్మరించకూడదని సీపీ స్పష్టం చేశారు.

నేరస్తులు సులభంగా జిల్లాలోకి వచ్చి వెళ్లే అవకాశం ఉన్నందున, వ్యాపార సముదాయాల వద్ద నిరంతరం నిఘా ఉండాలని సూచించారు. దుకాణాలు, బ్యాంకుల లోపలే కాకుండా బయటి వైపు రోడ్లు కనిపించేలా హై డెఫినిషన్ కెమెరాలు ఏర్పాటు చేయాలి. ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగినప్పుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా సెన్సార్లతో కూడిన అలారం వ్యవస్థలు ఉండాలి.

సెక్యూరిటీ గార్డులు, పని చేసే సిబ్బంది వివరాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో సరిచూసుకోవాలి. నగదు, బంగారం తరలించే సమయంలో పోలీసుల సహాయం తీసుకోవడం లేదా ప్రైవేట్ సెక్యూరిటీని పక్కాగా ఉంచుకోవాలి. నగరంలో పెరుగుతున్న ఆర్థిక లావాదేవీలకు అనుగుణంగా భద్రతా చర్యలు బలోపేతం చేస్తామని వ్యాపారులు, బ్యాంకర్లు ఈ సందర్భంగా కమిషనర్‌కు హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఏసీపీ ఏ. ప్రకాష్, సీఐలు శ్రీనివాసరాజ్, సతీష్ కుమార్, అంజయ్య, ఎస్‌హెచ్‌ఓ రఘుపతి, లీడ్ బ్యాంక్ మేనేజర్ సునీల్ కుమార్, గోల్డ్ అసోసియేషన్ ప్రతినిధులు లక్ష్మీకాంత్, యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!