తెలంగాణ యూనివర్సిటీకి చెందిన 100 ఎకరాలకు పైగా భూమిని వ్యవసాయ కాలేజీకి బదిలీ చేయడాన్ని నిరసిస్తూ, ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ పార్టీ, పీడీఎస్ యూ , టి యూసిఐ పిఓడబ్ల్యూ ,పి వై ఎల్ సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం ఆర్ & బీ గెస్ట్ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు .
ఈ సమావేశానికి టీయుసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ అధ్యక్షత వహించారు. సీపీఐ(ఎం.ఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు, సీపీఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్ లు మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ భూములను మరో యూనివర్సిటీకి చెందిన కాలేజీకి ఇవ్వడం సరైన నిర్ణయం కాదన్నారు.
ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ భూములు తరచూ కబ్జాలకు గురవుతున్నాయన్నారు. యూనివర్సిటీ భూములపై సర్వే నిర్వహించి, రక్షణ కోసం చర్యలు తీసుకోవాలన్నారు. సెలవు రోజుల్లో విద్యార్థులు లేని సమయంలో యూనివర్సిటీ భూములను బదిలీ చేయడం కుట్రగా కనిపిస్తుందన్నారు.
సెంట్రల్ యూనివర్సిటీ భూములను అమ్ముకోవాలనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులు ప్రజలు ఉద్యమాలతో బుద్ధి చెప్పారన్నారు. అదే స్ఫూర్తితో తెలంగాణ యూనివర్సిటీ భూములను పరిరక్షించుకుంటామన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి యూనివర్సిటీ భూములను తిరిగి బదిలీ చేయించాలన్నారు.
వ్యవసాయ కాలేజీ కోసం అన్ని రకాల సౌకర్యాలతో జక్రాన్ పల్లి మండలంలో భూములు ఉన్నాయన్నారు. అక్కడ ఏర్పాటు చేస్తే జిల్లా రైతాంగానికి విద్యార్థులకు ఉపయోగకరమన్నారు. ఎన్నో పోరాటాలతో తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్నామని, యూనివర్సిటీ భూముల పరిరక్షణ కోసం మరోసారి ఐక్య పోరాటాలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పి.డి.ఎస్.యు జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కే.గణేష్, ఎల్.అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విగ్నేష్, ఎన్.ఎస్.యు.ఐ తె.యూ అధ్యక్షులు శ్రీశైలం, ఏ.ఐ.పీ.ఎస్.యు ఉపాధ్యక్షులు గోపాల్, డీటీఎఫ్ నాయకులు శ్రీధర్, ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు శివరాజ్, పి.డి.ఎస్.యు నగర అధ్యక్షులు నసీర్ జిల్లా నాయకులు నితిన్, సృజన్, మమత తదితరులు పాల్గొన్నారు.
