పోక్సో కేసులో కామారెడ్డి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితుడికి జీవితఖైదు విధించింది.పోక్సో కేసులను కామారెడ్డి కోర్టు సీరియస్‌గా పరిగణిస్తోంది. గతేడాది మార్చి చివరి వారంలో ముగ్గురు పోక్సో నిందితులకు 20ఏళ్ల పాటు జైలు శిక్ష విధించగా తాజాగా మంగళవారం మరో కేసులో జీవితఖైదు విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.
కేసుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.దేవునిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో..దేవునిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విద్యార్థిని పట్టణంలోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటుండగా అదే కాలేజీలో చదువుతున్న తోకల రాజశేఖర్ అనే యువకుడు ఆమెను ప్రేమిస్తున్నానని వేధించాడు.
ఆమె తనకు ఇష్టం లేదని చెప్పినప్పటికీ ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఫోన్‌కు వీడియోలు పంపి భయపెట్టాడు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడిన ఫోన్ రికార్డులను దుర్వినియోగం చేసేందుకు ప్రయత్నించాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి ఒంటరి ప్రదేశానికి తీసుకెళ్లి బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పక్కా ఆధారాలతో కేసు విచారణ..ఈ ఘటనపై బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ అనంతరం రాజశేఖర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పూర్తి సాక్ష్యాధారాలను సేకరించి పోక్సో చట్టం కింద కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు.
కేసు పూర్వాపరాలు, సాక్ష్యాలు, వైద్య నివేదికను పరిశీలించి కేసు రుజువు కావడంతో జిల్లా న్యాయమూర్తి వరప్రసాద్ నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.50 వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.
