గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం,మహమ్మద్ అజారుద్దీన్ ల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కోదండరాం, అజారుద్దీన్ ను ఎమ్మెల్సీలుగా నియమించడాన్ని రద్దు చేయాలని కోరారు.
కోదండరాం, అజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 26న జారీ చేసిన జీవో 71ను సవాల్ చేస్తూ హైదరాబాద్ కు చెందిన సయ్యద్ హైదర్ పిటిషన్ దాఖలు చేశారు. నామినేషన్ పద్ధతిలో ఎంపిక చేసిన వారికి రాజ్యాంగం నిర్దేశించిన అర్హతలు లేవని పిటిషనర్లు పేర్కొన్నారు.
సాహిత్యం, విజ్ఞానం, కళలు, సహకార ఉద్యమం, సామాజిక రంగంలో విశిష్ఠ సేవలందించిన వ్యక్తులను మాత్రమే గవర్నర్ కోటాలో అవకాశం కల్పించాల్సి ఉందని తెలిపారు. అభ్యర్థులపై ఉన్న అన్ని అంశాలను ప్రభుత్వం పరిశీలించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని చెప్పారు.
వీరి నియామానికి సంబంధించిన రికార్డులన్నింటిని తెప్పించాలని కోరారు. ప్రత్యేకమైన వ్యక్తులతో భర్తీ చేయాల్సిన పోస్టులు, రాజకీయ నియామకాలుగా మారాయని ఆరోపించారు. జీవో 71 అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కోదండరాం, అజారుద్దీన్ ను ప్రతివాదులుగా పేర్కొన్నారు. దీనిపై హైకోర్టు త్వరలో విచారణ చేపట్టే అవకాశం ఉంది.*
