మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై గురువారం తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనుగోలు కేంద్రాల్లో పడి ఉండటమే కాకుండా కొనే దిక్కు లేకపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు.
చాలా చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు దాటి బయటకు వెళ్లడం లేదు. అయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం పై ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో కోతలు పూర్తి చేసి ధాన్యాన్ని రోడ్డుపై ఆరబెట్టామని, కొందరు రైతుల వరి ధాన్యం ఇప్పటికే ఆరిపోయినప్పటికీ, ప్రభుత్వం గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
ఎలాంటి నిబంధనలు లేకుండా వెంటనే వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సుమారు 5 వేల బస్తాలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు తరలించేందుకు వాహనాలు సకాలంలో రాక రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
సమాచారం అందుకున్న ఎమ్మార్వో కృష్ణ, ఎస్సై జి. అనిల్ రెడ్డి తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. పై అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నాను విరమించారు.
