నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకులు బాస రమేష్ యాదవ్ గారు ఈరోజు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ జన సమితి పార్టీలో చేరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
వీరితో పాటు బాల్కొండ నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు కూడా పార్టీలో చేరారు.ఈ సందర్భంగా బాస రమేష్ యాదవ్ మాట్లాడుతూ ప్రొఫెసర్ కోదండరాం గారి నాయకత్వంలో పనిచేయడం గర్వంగా భావిస్తున్నానన్నారు.
తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన, తెలంగాణ పునర్నిర్మాణం కోదండరాం గారి నాయకత్వంలోనే సాధ్యమనే నమ్మకంతో టి.జే.ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయం, ప్రజాస్వామ్య పరిరక్షణ, సామాజిక న్యాయం తెలంగాణ జన సమితి ప్రధాన లక్ష్యాలని తెలిపారు.
ప్రస్తుతం డబ్బు కేంద్రంగా సాగుతున్న రాజకీయాల మధ్య ప్రజల ఆకాంక్షలనే అజెండాగా చేసుకుని టి.జే.ఎస్ పనిచేస్తోందన్నారు. భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ జన సమితి నిరంతరం పోరాడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో టి.జే.ఎస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు కంతి మోహన్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరి రమేష్, జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దార సత్యం, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు దేశపాక శ్రీనివాస్, పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జ్ హనుమంత్ రెడ్డి, విద్యార్థి జన సమితి నాయకులు రవి నాయక్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
