HomePOLITICAL NEWSUncategorizedమామను హత్య చేసిన అల్లుడికి పదేళ్ల జైలు శిక్ష..

మామను హత్య చేసిన అల్లుడికి పదేళ్ల జైలు శిక్ష..

రూ. 2 వేల జరిమానా విధించిన నిజామాబాద్ ఉమెన్స్ కోర్టు ఏడాదిలోనే నిందితుడికి శిక్ష పడేలా చేసిన నవీపేట్ పోలీసులుకుటుంబ కలహాల నేపథ్యంలో కన్నమామను ఇటుకతో బాది కిరాతకంగా హత్య చేసిన అల్లుడికి పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 2,000 జరిమానా విధిస్తూ నిజామాబాద్ నాలుగో అదనపు జిల్లా, సెషన్స్ (ఉమెన్స్) కోర్టు న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ గురువారం సంచలన తీర్పు వెలువరించారు.

నవీపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడాది క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి… పోలీసుల కథనం ప్రకారం.. నవీపేట్ మండలం అనంతగిరి గ్రామానికి చెందిన బిలమసింగ్ తన కుమార్తె, అల్లుడు రాజేష్‌తో కలిసి తిమ్మసముద్రం ప్రాంతంలో కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.

అయితే కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో.. తన కుమార్తెను సక్రమంగా చూసుకోవాలని బిలమసింగ్ పలుమార్లు అల్లుడు రాజేష్‌కు నచ్చజెప్పాడు.

ఈ క్రమంలోనే గత ఏడాది ఏప్రిల్ 27న ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన రాజేష్.. సమీపంలో ఉన్న ఇటుకతో మామ బిలమసింగ్ తలపై బలంగా కొట్టాడు.

తీవ్ర రక్తస్రావం కావడంతో బిలమసింగ్ అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువు రాజేందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నవీపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అప్పటి దర్యాప్తు అధికారులు ఘటనకు సంబంధించిన ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, వైద్య నివేదికలు పక్కాగా సేకరించి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఉమెన్స్ కోర్టులో జరిగిన విచారణలో ప్రాసిక్యూషన్ తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) ఎం. నీరజ సమర్థవంతంగా వాదనలు వినిపించి, సాక్ష్యాధారాలను నిరూపించారు.

నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి డి. దుర్గాప్రసాద్ నిందితుడు రాజేష్‌కు పదేళ్ల కఠిన శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో అదనపు జైలు శిక్ష అనుభవించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

నేరం జరిగిన ఏడాది కాలంలోనే నిందితుడికి పక్కాగా శిక్ష పడేలా శ్రమించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. నీరజతో పాటు నవీపేట్ ఎస్ఐ (బ్రీఫింగ్ ఆఫీసర్) కే. శ్రీకాంత్, నార్త్ రూరల్ సీఐ బి. శ్రీనివాస్, ధర్పల్లి ఎస్సై కే. వినయ్, కోర్టు లైజన్ ఆఫీసర్ టి. గోవింద్‌లను నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, ప్రత్యేకంగా అభినందించారు. అలాగే కోర్టు డ్యూటీ అధికారులు రాజకుమార్, సుప్రియ , కే. చంద్రశేఖర్ , కే. గణేష్ లను సీపీ ప్రశంసించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments