HomeCRIMEమైనర్ బాలికపై అఘాయిత్యం: ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు..రూ.70 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్‌...

మైనర్ బాలికపై అఘాయిత్యం: ఆటో డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు..రూ.70 వేల జరిమానా విధించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పదో తరగతి చదువుతున్న మైనర్ బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి కామారెడ్డి ఫాస్ట్‌ట్రాక్ స్పెషల్ కోర్టు (రేప్ & పోక్సో కేసుల విచారణ కోర్టు) 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.70,000 జరిమానా విధిస్తూ గురువారం సంచలన తీర్పునిచ్చింది.

జిల్లా న్యాయమూర్తి డా. సిహెచ్ వివిఆర్ వరప్రసాద్ ఈ మేరకు తీర్పు వెలువరించారు. తాడ్వాయి పోలీసులు పక్కా సాక్ష్యాధారాలతో నేరాన్ని నిరూపించడంతో న్యాయస్థానం ఈ శిక్ష ఖరారు చేసింది. ​పోలీసుల కథనం ప్రకారం..

తాడ్వాయి మండలానికి చెందిన మహమ్మద్ అబ్దుల్ రహీం (20) ఆటో నడుపుతూ, పార్ట్ టైమ్‌గా టెంట్ హౌస్‌లో పనిచేసేవాడు. టెంట్ హౌస్ సమీపంలో ఉన్న ఐస్‌క్రీమ్ దుకాణానికి తరచూ వచ్చే పదో తరగతి మైనర్ బాలికను చూసి చనువు పెంచుకున్నాడు.

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. తాను మైనర్‌నని, తన వెంట పడవద్దని బాలిక పలుమార్లు చెప్పినా వినకుండా వేధించేవాడు. వయసు రీత్యా ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ​2022 ఆగస్టు 5న ఉదయం స్కూల్‌కు వెళ్లిన బాలిక సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాలేదు.

ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లలో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, అదే రోజున నిందితుడు రహీం బాలికకు మాయమాటలు చెప్పి కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లాడు.

అక్కడ వివిధ ప్రాంతాల్లో ఉంచుతూ ఆమెపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ​ ​బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు ఢిల్లీలో ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందం ఢిల్లీకి వెళ్లి మైనర్ బాలికను సురక్షితంగా రక్షించి తీసుకువచ్చారు.

బాలిక ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు మహమ్మద్ అబ్దుల్ రహీంపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సమగ్ర సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలను సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ కేసులో పక్కా ఆధారాలు సేకరించి నిందితుడికి శిక్ష పడేలా చేయడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి డీఎస్పీ ఏ. శ్రీనివాసులు, ప్రస్తుత డీఎస్పీ ఎస్. శ్రీనివాస్ రావులను ఎస్పీ అభినందించారు.

కోర్టులో బలంగా వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కె. శేషు, సూర్యప్రసాద్, సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన ప్రస్తుత ఎన్‌హెచ్ వై. నరేష్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ (ASI) రామేశ్వర్ రెడ్డి, కోర్టు కానిస్టేబుల్ టి. సాయిబాబులను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments