నందిపేట్ మండల కేంద్రంలో విషాదం కన్నప్రేమ కరువైందో.. లేక ఆడపిల్ల అని తెలిసి ఇలా వదిలేశారా సామాజిక భయమో కానీ, అప్పుడే పుట్టిన ఒక పసికందును ముళ్లపొదల్లో వదిలేసిన అమానుష ఘటన నందిపేట్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
ఊపిరిపోసిన ప్రాణాన్ని నడిరోడ్డుపై వదిలేసిన వైనం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. చివరికి ఆ పసిపాప ఆసుపత్రిలో కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. నందిపేట్ మండల కేంద్రంలోని రాజ్ నగర్ దుబ్బా ప్రాంతంలోని ఓ నిర్మానుష్య చెట్ల పొదల్లో నుంచి ఆదివారం ఓ పసిపాప ఏడుపు వినిపించింది.
ఆ దారి గుండా వెళ్తున్న ఒక యువకుడు ఏడుపు శబ్దాన్ని గమనించి పొదల్లోకి వెళ్లి చూడగా.. అప్పుడే పుట్టిన ఆడ శిశువు రక్తసిక్తమై కొట్టుమిట్టాడుతూ కనిపించింది. ఆ దృశ్యం చూసి చలించిపోయిన ఆ యువకుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పసిపాపను చేతుల్లోకి తీసుకుని, వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు.
ఆసుపత్రిలో చేరిన వెంటనే వైద్యులు శిశువుకు అత్యవసర చికిత్స అందించారు. అప్పటికే ఎండ తీవ్రతకు, పొదల్లో పడి ఉండటం వల్ల పాప ఆరోగ్యం బాగా క్షీణించింది. వైద్యులు శాయశక్తులా ప్రయత్నించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో ఆ పసిపాప ఆసుపత్రిలోనే తుదిశ్వాస విడిచింది.
నిండు ప్రాణం ఇలా అర్ధాంతరంగా గాల్లో కలిసిపోవడంతో స్థానికులు కన్నీరుమున్నీరయ్యారు. పురిట్లోనే ఆడపిల్ల అని తెలిసి ఇలా వదిలేశారా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో స్థానికంగా తీవ్ర చర్చ సాగుతోంది.
కన్నతల్లే ఈ పని చేసిందా, లేక ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు తెచ్చి ఇక్కడ పడేశారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ అమానుష ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నందిపేట్ ఎస్ఐ తెలిపారు.
