మెండోరా పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన హత్య కేసులో నిందితుడికి జీవిత కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ/ఎస్టీ ప్రత్యేక కోర్టు (రెండో అడిషనల్ సెషన్స్ జడ్జ్) న్యాయమూర్తి ఎస్. నారాయణ సోమవారం తీర్పునిచ్చారు. శిక్షతో పాటు రూ.2,000 జరిమానా కూడా విధించారు.
ఈ మేరకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వివరాలను వెల్లడించారు. మెండోరా మండలంలోని బుసపూర్ గ్రామానికి చెందిన సుద్ద లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. 2021 ఆగస్టు 27న ఉదయం 5 గంటల సమయంలో బుసపూర్ బస్టాండ్ సమీపంలోని హోటల్ వద్ద మృతుడు సుద్ద లింగన్న టీ తాగుతున్నాడు.
అదే సమయంలో అక్కడకు వచ్చిన నిందితుడు సోమ నవీన్ అలియాస్ నవీన్ రెడ్డి గురడికాపు.. బొర్రయ్య అనే వ్యక్తి మోటార్ సైకిల్‌కు నిప్పు పెట్టాడు.దీనిని లింగన్న, బొర్రయ్య నిలదీయడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు ‘మిమ్మల్ని చంపేస్తా’ అని బెదిరిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
అనంతరం గొడ్డలి, కొంకి (కత్తి)తో తిరిగి వచ్చి లింగన్నపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్ర రక్తగాయాలైన లింగన్నను నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మెండోరా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసులు ఈ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపి, పక్కా సాక్ష్యాధారాలను న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. దయాకర్ గౌడ్ వాదనలు వినిపించారు. నిందితుడిపై నేరం రుజువు కావడంతో గౌరవ న్యాయమూర్తి నిందితుడు సోమ నవీన్‌కు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పారు.
ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన. దయాకర్ గౌడ్ (పీపీ), కే. శ్రీధర్ రెడ్డి (మొదటి ఐ.ఓ), వి. రఘు (రెండవ ఐ.ఓ), జె. సుహాసిని జాదవ్ (మెండోరా ఎస్సై), టి. గోవిందు (లైజన్ ఆఫీసర్), ఎస్. రాజు (పీసీ 1825), బి. సాగర్ (పీసీ 710), బి. విక్రమ్ (పీసీ 379). అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ప్రత్యేకంగా అభినందించారు.
