HomeCRIMEచిరుత వేటగాళ్ల ముఠా గుట్టురట్టు ..రెండు వేర్వేరు కేసుల ఛేదన.. 9 నాటు తుపాకుల స్వాధీనం10...

చిరుత వేటగాళ్ల ముఠా గుట్టురట్టు ..రెండు వేర్వేరు కేసుల ఛేదన.. 9 నాటు తుపాకుల స్వాధీనం10 మంది అరెస్టు…

నిజామాబాద్ జిల్లాలో వరుసగా వెలుగుచూసిన రెండు చిరుతపులుల మృతి ఘటనల వెనుక ఉన్న వేట ముఠాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. ధర్పల్లి, భీంగల్ మండలాల్లో వెలుగుచూసిన చిరుత మృతి కేసుల దర్యాప్తులో కీలక ఆధారాలు లభించడంతో అటవీశాఖ, పోలీసులు సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో వన్యప్రాణుల వేటకు ఉపయోగిస్తున్న తొమ్మిది లైసెన్సులేని నాటు తుపాకులను స్వాధీనం చేసుకొని పది మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.

అరెస్టయిన వారిలో భూక్యా రఘుపతి, కార్ల అంజయ్య, ముదావత్ తిరుపతి, భూక్యా చందర్, ముర్రి గంగ నర్సయ్య, అనిమేని లింబాద్రి, మాలావత్ కుంభ, బానావత్ గంగారెడ్డి, మాలావత్ ధారి సింగ్, అకునూర్ రాజు ఉన్నారు. వీరందరిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ మేరకు గురువారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సిపి సాయి చైతన్య, జిల్లా అటవీశాఖ అధికారి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసుల వివరాలను వెల్లడించారు. పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సీసీఎస్, భీంగల్ పోలీసులు గురువారం తెల్లవారుజామున దేవక్కపేట గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.

విశ్వసనీయ సమాచారం మేరకు అడవిలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా వారి వద్ద తొమ్మిది లైసెన్సులేని నాటు తుపాకులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.ప్రాథమిక విచారణలో నిందితులు అడవి జంతువులు, ఇతర వన్యప్రాణులను వేటాడేందుకే ఈ నాటు తుపాకులను వినియోగిస్తున్నట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.

ఇటీవల దేవక్కపేట అటవీ ప్రాంతంలో చిరుత మృతి చెందిన ఘటన తర్వాత పోలీసులు, అటవీశాఖ విస్తృత తనిఖీలు చేపట్టడంతో తమ వద్ద ఉన్న తుపాకులను అడవిలో దాచిపెట్టేందుకు తీసుకెళ్తుండగా పట్టుబడ్డట్లు వెల్లడించారు.

మేక కళేబరంలో విషం.. చిరుత మృతి

ఆర్మూర్ డివిజన్ పరిధిలోని కారేపల్లి దక్షిణ బీట్‌లో ఇటీవల వెలుగుచూసిన చిరుత హత్య కేసును కూడా అధికారులు ఛేదించారు. మేకల కాపరి మలావత్ సంజీవ్‌కు చెందిన మేకను చిరుత చంపడంతో దేవక్కపేటకు చెందిన సిరిసిల్ల రాములు చిరుతను చంపి దాని అవయవాలను విక్రయిస్తే లక్షల రూపాయలు వస్తాయని ఆశ చూపినట్లు విచారణలో తేలింది.

దీంతో మలావత్ సంజీవ్ తన గ్రామానికి చెందిన మరో నలుగురితో కలిసి చనిపోయిన మేక కళేబరంలో సిరంజి ద్వారా విషం ఎక్కించారు. మరుసటి రోజు ఆ మేకను తిన్న చిరుత మృతి చెందగా, దాని కళేబరాన్ని కారేపల్లి దక్షిణ బీట్‌లోని 79వ కంపార్టుమెంట్లో భూమిలో పాతిపెట్టారు.

సరైన కొనుగోలుదారు దొరికిన తర్వాత బయటకు తీసి విక్రయించాలని భావించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.నిందితులు చూపిన మేరకు అటవీశాఖ అధికారులు భూమిలో పాతిపెట్టిన చిరుత కళేబరాన్ని వెలికితీసి స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం సిరిసిల్ల రాములు ఇంట్లో నిర్వహించిన తనిఖీల్లో మరో లైసెన్సులేని నాటు తుపాకీ లభించడంతో దానిని భీంగల్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో మలావత్ సంజీవ్, సిరిసిల్ల రాములను అరెస్టు చేయగా మరో నలుగురు పరారీలో ఉన్నట్లు తెలిపారు.

ఉచ్చులో చిక్కిన చిరుతను కొట్టి చంపారు

నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇందల్వాయి అటవీ క్షేత్రం ఆమ్సన్‌పల్లి బీట్‌లో మూడు నుంచి ఐదు నెలల క్రితం జరిగిన మరో చిరుత వేట కేసును కూడా అధికారులు ఛేదించారు. అడవి పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకున్న చిరుతను నిందితులు కర్రలతో కొట్టి చంపినట్లు దర్యాప్తులో తేలింది.

ఆ తర్వాత చిరుత మృతదేహాన్ని ధర్పల్లి గ్రామ శివారులోని మామిడి తోటకు తరలించి చర్మాన్ని ఒలిచి, నాలుగు పంజాలను వేరు చేశారు. మిగిలిన శరీర భాగాలను సమీపంలోని పాడుబడిన బావిలో పడేశారు.

బావిలో నుంచి కుళ్లిపోయిన చిరుత చర్మాన్ని స్వాధీనం చేసుకొని పశువైద్య పరీక్షలకు పంపగా అది చిరుత చర్మమేనని నిర్ధారణ అయింది. దర్యాప్తులో వేటకు ఉపయోగించిన ఉచ్చులు, వేట సామగ్రి, చిరుత గోర్లు తదితర కీలక ఆధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా మరో నిందితుడితో పాటు ఇతరుల కోసం గాలింపు కొనసాగుతోంది.

కఠిన చర్యలు తప్పవు వన్యప్రాణులను వేటాడడం, వాటి అవయవాలను నిల్వ చేయడం, విక్రయించడం, రవాణా చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరమని అధికారులు హెచ్చరించారు. వన్యప్రాణుల సంరక్షణకు భంగం కలిగించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే అటవీశాఖ లేదా పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments