కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నిజామాబాద్ అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ధర్నా చౌక్ వద్ద గురువారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
పార్టీ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సహా నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజలపై మోయలేని భారం మోపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు తక్కువగా ఉన్నప్పటికీ, దేశంలో మాత్రం ఇంధన ధరలను పెంచడం దుర్మార్గమన్నారు. పెంచిన ధరలను కేంద్రం తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎస్.ఐ.ఆర్ పేరుతో తమ పార్టీని విచ్ఛిన్నం చేస్తూ, ప్రజల ఓటు హక్కును కాలరాసేందుకు బీజేపీ నాయకత్వంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఎస్.ఐ.ఆర్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కార్మికుల హక్కులను హరించేలా ఉన్న నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల ఇప్పటికే దేశ ఆర్థిక రంగం, ప్రజల జీవన స్థితిగతులు పూర్తిగా చిన్నాభిన్నమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం తన వైఖరిని మార్చుకోకపోతే.. వామపక్ష, ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలను ఏకం చేసి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఎం.నరేందర్, జిల్లా నాయకులు ఎం.వెంకన్న, డి.రాజేశ్వర్, కే.గంగాధర్, ఎం.సుధాకర్ పాల్గొన్నారు. అలాగే వివిధ ప్రజాసంఘాల ప్రతినిధులు కే.సంధ్యారాణి, కే.గణేష్, ఎల్.అనిల్ కుమార్, అషుర్, సాయిబాబా, ఒడ్డెన్న, సాయరెడ్డి, భాస్కరస్వామి, విఠల్, అమూల్య, రమేష్, చరణ్, సాయిలు, సృజన్, మానస, లక్ష్మి, లలిత తదితరులు పాల్గొన్నారు.
