తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. వేడుకల ఏర్పాట్లను సోమవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య క్షుణ్ణంగా పర్యవేక్షించారు.
ముందుగా పోలీస్ కమిషనరేట్ కార్యాలయంతో పాటు, వేడుకలు జరిగే ప్రదేశంలో జరుగుతున్న పనులను కమిషనర్ పరిశీలించారు. వేదిక నిర్మాణం, అతిథుల కూర్చునే ఏర్పాట్లు, పార్కింగ్ సదుపాయాలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
కార్యక్రమానికి వచ్చే ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద జరుగుతున్న ఏర్పాట్లను సీపీ తనిఖీ చేశారు.
తెలంగాణ సాధన కోసం అమరులైన వారి త్యాగాలను స్మరిస్తూ, నివాళులర్పించే కార్యక్రమాన్ని అత్యంత గౌరవప్రదంగా నిర్వహించాలని సూచించారు. స్థూపం పరిసరాల్లో పరిశుభ్రతకు ప్రాధాన్యతనిస్తూనే, భద్రతా పరంగా ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని స్పష్టం చేశారు.
వేడుకల నిర్వహణలో వివిధ శాఖల మధ్య సమన్వయం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ శ్రీధర్ రెడ్డి, టౌన్-4 ఎస్.హెచ్.ఓ సతీష్, నిజామాబాద్ నార్త్ తహసిల్దార్ అనిల్ గిరిధర్, సాయిలు తదితర అధికారులు పాల్గొన్నారు.
