నిరుద్యోగ యువకులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు . ఈ నెలలోనే టిజి పి యస్ సి ద్వారా ఇంజినీరింగ్, విద్యా, అటవీ, టౌన్ ప్లానింగ్ శాఖల్లో మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. .. తమ 30 నెలల కాంగ్రెస్ పాలనలో ఇప్పటికే 67 వేల ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేశామన్నారు.
రూ.20,616 కోట్ల రుణమాఫీతో 25 లక్షల మంది రైతులను రుణవిముక్తులను చేశామని, మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం స్పష్టం చేశారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ భావోద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన ఈ 30 నెలల కాలంలో సాధించిన ప్రగతిని, అమలు చేసిన సంక్షేమ పథకాల విజయాలను ప్రజల ముందుంచారు.
దశాబ్దాల తెలంగాణ కల సాకారం కావడానికి నాడు అచంచల నిర్ణయం తీసుకున్న యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్కు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
పుట్టుకనీది, చావునీది.. బతుకంతా దేశానిది అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు మాటలను గుర్తుచేస్తూ.. ఆయన స్ఫూర్తితోనే రాష్ట్ర హితం కోసం రాత్రింబగళ్లు శ్రమిస్తున్నామని చెప్పారు.అధికారం అనేది ఎవ్వరికీ శాశ్వతం కాదన్న సత్యాన్ని తాము నమ్ముతామని రాచరికాన్ని లేదా కొందరి పెత్తనాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ సహించదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వమంటే నలుగురి చేతుల్లో ఉండే పవర్ కాదని ప్రజల ఆశలను నెరవేర్చే వేదిక అని అన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ ఇప్పటికే 1,362 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ తరగతులు ప్రారంభించామని అన్ని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉదయం బ్రేక్ ఫాస్ట్ అందిస్తూ.. జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైతం మధ్యాహ్న భోజన పథకాన్ని విస్తరించామని గుర్తుచేశారు.
