పదేళ్ల పాలనలో నిజామాబాద్ నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని గొప్పలు చెప్పుకునే మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా.. చేసిందంతా అభివృద్ధి కాదు, కేవలం ‘సీసీసీ’ (కరెప్షన్, కలెక్షన్, కమిషన్) దందానేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఘాటుగా విమర్శించారు.
బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.నిజామాబాద్ నగర అభివృద్ధిని పక్కన పెట్టి, గత పదేళ్ల కాలంలో కేవలం ‘కమిషన్, కలెక్షన్, కరెప్షన్’ (సీసీసీ)లకే పరిమితమైయ్యడని ఆయన ఆరోపించారు.
నగరంలోని ట్యాంక్‌బండ్ అభివృద్ధిలో భారీ అక్రమాలు జరిగాయని ధన్పాల్ ఆరోపించారు. అక్కడ మొక్కలు నాటకుండానే 45 లక్షల రూపాయలు, త్రిమూర్తి దగ్గర రూ.35 లక్షలు, కంఠేశ్వర్ వద్ద రూ.45 లక్షల చొప్పున నిధులను కాజేశారని మండిపడ్డారు.
ట్యాంక్‌బండ్ వద్ద మొక్కల పేరుతోనే రూ.45 లక్షల అవినీతి జరిగిందని ఆయన ఆధారాలతో సహా ప్రశ్నించారు. వెజ్–నాన్‌వెజ్ మార్కెట్లు, డివైడర్ల నిర్మాణాల్లోనూ బిగాల వర్గీయులు భారీగా దండుకున్నారని ఆరోపించారు.పనీపాట లేకుండా 330 మందిని నియమించి, వారికి నెలకు రూ.50 లక్షల జీతాల పేరిట ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు.
ఇందులో మాజీ మేయర్ భర్త, అనుచరులు అందరూ కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. కాళభారతి, మార్కెట్ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడానికి మీ నిర్వాకమే కారణమని, అధికారుల పర్యవేక్షణ కరువైందని మండిపడ్డారు. గత మున్సిపల్ ఎన్నికల్లో 60 వార్డులకు గాను కేవలం ఒకే ఒక్క స్థానంలో గెలిచిన బీఆర్ఎస్ పార్టీ, ఆ ఒక్కటి కూడా అధికార పార్టీకి అమ్ముకున్న ఘనత మాజీ ఎమ్మెల్యేదని ధన్పాల్ ధ్వజమెత్తారు.
“నీ ఓటుతోనే కాంగ్రెస్ మేయర్ అయ్యారని ఎద్దేవా చేశారు. రెండున్నర ఏళ్లలో నేను చేసిన అవినీతి చూపిస్తే పదవులకు రాజీనామా కాదు, రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ఎలా దోచుకున్నారో, నిజామాబాద్‌లో బిగాల అంతకంటే ఎక్కువ దోచుకున్నారని ఆరోపించారు.కాలభారతి, మార్కెట్ నిర్మాణాలు ఎందుకు ఆగిపోయాయో సమాధానం చెప్పే దమ్ము ఉందా అని బిగాలను ఆయన నిలదీశారు.
తన అభివృద్ధిపై మాట్లాడే దమ్ము లేక, అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.పదేళ్ల పాటు అధికారంలో ఉండి నిజామాబాద్‌ను కమీషన్ల అడ్డాగా మార్చిన మీకు మాట్లాడే నైతిక హక్కు లేదు.
దమ్ముంటే గణపతి గుడి దగ్గరకు రా.. తేదీ, సమయం నిర్ణయించు, నీ ‘సీసీసీ’ (కమిషన్, కలెక్షన్, కరెప్షన్) బాగోతాలు, నేను చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?” అని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాకు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతి రెడ్డి బిజెపి కార్పొరేటర్లు పాల్గొన్నారు.
