HomeLaw and Orderనర్సింగ్ కాలేజ్ ను సందర్శించిన కలెక్టర్..విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు ఆదేశం...

నర్సింగ్ కాలేజ్ ను సందర్శించిన కలెక్టర్..విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్వాహకులకు ఆదేశం…

మాక్లూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ ను కలెక్టర్ ఇలా త్రిపాఠి శుక్రవారం సందర్శించారు. కాలేజీ ఆవరణను పరిశీలించిన సందర్భంగా ప్రహరీ లేకపోవడాన్ని గమనించిన కలెక్టర్, వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

విద్యార్థినుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, నర్సింగ్ కాలేజీ వద్ద, పరిసర ప్రాంతాలలో పోలీసులు పెట్రోలింగ్ చేసేలా చూడాలని అన్నారు. తుది దశలో కొనసాగుతున్న నిర్మాణ పనుల నాణ్యతను తనిఖీ చేసి, వివరాలను అడిగి తెలుసుకున్నారు.

యుద్దప్రాతిపదికన పనులను పూర్తి చేయించాలని, విద్యార్థినులకు అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో భేటీ అయ్యారు. విద్యార్థినులకు పలు ప్రశ్నలు వేస్తూ వారి అభ్యాసన సామర్థ్యాన్ని అంచనా వేశారు.

తన వెంట తెచ్చిన డైరీలు, చాక్లెట్లు, బహుమతులను అందించారు. నర్సింగ్ కోర్సు ఎంతో డిమాండ్ కలిగిన చక్కటి కోర్సు అని, ఏకాగ్రతతో ఇష్టంగా చదువుకోవాలని హితవు పలికారు. కరోనా సమయంలో పారా మెడికల్ సిబ్బంది అందించిన సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.

సేవా భావంతో కూడిన నర్సింగ్ కోర్సు వల్ల ఉద్యోగ అవకాశాలతో పాటు ఆకర్షణీయమైన వేతనాలతో విరివిగా ఉపాధికి లభించేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. స్మార్ట్ ఫోన్, సోషల్ మీడియా వంటికి ఒకింత దూరంగా ఉండాలని, ఉన్నత భవిష్యత్తు కోసం ప్రణాళికతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వారి కలలను నిజం చేయాలని, అధ్యాపకులకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. కాగా, వ్యక్తిగత భద్రత విషయంలో ఏమరుపాటుగా ఉండకుండా అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని విద్యార్థినులకు జాగ్రత్తలు సూచించారు.

ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ధైర్యంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఏవైనా అనుకోని ఘటనలు జరిగితే సఖీ వన్ స్టాప్ సెంటర్ ను సంప్రదిస్తే, వారు అన్ని విధాలుగా వెన్నుదన్నుగా నిలుస్తూ న్యాయం జరిగేలా కృషి చేస్తారని, మీ వ్యక్తిగత గుర్తింపు బయటపడకుండా గోప్యత పాటిస్తారని కలెక్టర్ తెలిపారు.

బాలికల రక్షణకు, వారి ఆరోగ్యాల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, బయటి వ్యక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించకూడదని, బంధువులు అయినా సరే లోనికి రాకుండా చూడాలని నిర్వాహకులను, సిబ్బందిని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎంతమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట స్థానిక తహసీల్దార్ శేఖర్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ భూలక్ష్మి తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments