HomeTelanganaHyderabadనేర పరిశోధనలో కొత్త అధ్యాయం.. సీఐడీ లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, షీ సైబర్ ల్యాబ్...

నేర పరిశోధనలో కొత్త అధ్యాయం.. సీఐడీ లో అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్, షీ సైబర్ ల్యాబ్ ఆవిష్కరించిన ….డీజీపీ సి.వి. ఆనంద్

సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో నేరాల స్వరూపం కూడా వేగంగా మారుతోందని, అలాంటి పరిస్థితుల్లో ఆధునిక సాంకేతికతను వినియోగించడమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు మూల సూత్రమని రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ) సి.వి. ఆనంద్ అన్నారు.

నేర నియంత్రణ, దర్యాప్తు, సైబర్ నేరాల ఛేదన, డేటా విశ్లేషణ వంటి రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్‌లోని సీఐడీ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు షీ సైబర్ ల్యాబ్‌ను డీజీపీ శుక్రవారం నాడు ప్రారంభించారు.

కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత స్మార్ట్ క్రైమ్ అనాలిటిక్స్, డేటా మేనేజ్‌మెంట్, స్మార్ట్ కాన్ఫరెన్స్ సదుపాయాలతో రూపొందించిన ఈ వ్యవస్థ నేర పరిశోధనలో కొత్త ఒరవడికి నాంది పలుకుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో డీజీపీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్ శాఖ సాంకేతిక వినియోగంలో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించిందన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ పోలీసులు వినూత్న ఆవిష్కరణలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.

ముఖ్యంగా సైబర్ నేరాల నియంత్రణ, డిజిటల్ ఫోరెన్సిక్ దర్యాప్తు, డేటా ఆధారిత పోలీసింగ్, క్రైమ్ అనాలిటిక్స్ రంగాల్లో తెలంగాణ పోలీస్ శాఖ విశేష పురోగతి సాధించిందని తెలిపారు.

ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడంతో పాటు నేరాలపై వేగవంతమైన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ పోలీస్ శాఖ నిరంతరం కొత్త సాంకేతిక వ్యవస్థలను అందుబాటులోకి తీసుకొస్తోందన్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన ‘టీ-స్పార్క్’ (T-SPARK) వంటి సాంకేతిక బృందాలు పోలీసింగ్‌లో ఆధునిక విధానాలను ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు.

స్మార్ట్ కంప్యూటర్ ల్యాబ్ ప్రత్యేకతలు

సీఐడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ అత్యాధునిక కంప్యూటర్ ల్యాబ్‌లో అనేక వినూత్న సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇది మాట్లాడుతున్న వ్యక్తిని కెమెరా గుర్తించి అతని వైపు తిరగడంతో పాటు, మాట్లాడే వ్యక్తిపై ఆటోమేటిక్‌గా జూమ్ అవుతూ వీడియో, ఆడియో రికార్డింగ్ చేస్తుంది.

సమావేశాల్లో చర్చించిన అంశాలను డిజిటల్ రూపంలో భద్రపరచడంతో పాటు అవసరమైనప్పుడు తిరిగి విశ్లేషించే అవకాశం కల్పిస్తుంది.

అదేవిధంగా మానిటర్ లేదా డిజిటల్ బోర్డుపై ఇచ్చిన సమాచారాన్ని గుర్తించి టెక్స్ట్, ఆడియో లేదా నివేదిక రూపంలో మార్చగల సామర్థ్యం ఈ వ్యవస్థకు ఉంది.

కృత్రిమ మేధస్సు సాయంతో సమాచారాన్ని విశ్లేషించి క్రైమ్ మ్యాపింగ్, డేటా ఫిల్టరింగ్, నేర ధోరణుల అధ్యయనం, కేసుల సమీక్ష వంటి అంశాలను మరింత వేగవంతంగా, ఖచ్చితంగా నిర్వహించవచ్చు.

బాధితులు, ఫిర్యాదుదారుల అభిప్రాయాలను కూడా డిజిటల్ రూపంలో నమోదు చేసి భద్రపరచడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. దీనివల్ల కేసుల పురోగతి, దర్యాప్తు నాణ్యత, ప్రజల స్పందన వంటి అంశాలపై సమగ్ర విశ్లేషణ చేయడం సులభమవుతుంది.

అలాగే క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ అండ్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్) వేదికలో కేసుల నమోదు, డేటా నిర్వహణ, విశ్లేషణ, ధృవీకరణ, అవసరమైన సవరణలు వంటి ప్రక్రియలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ సాంకేతిక వ్యవస్థ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

ఈ ఆధునిక సాంకేతిక వ్యవస్థల ద్వారా నేర పరిశోధనలో ఖచ్చితత్వం పెరగడంతో పాటు దర్యాప్తు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగవంతంగా మారుతుందని డీజీపీ పేర్కొన్నారు.

భవిష్యత్తులో తెలంగాణ పోలీసింగ్‌ను మరింత సాంకేతికంగా బలోపేతం చేయడంలో ఈ ల్యాబ్‌లు కీలక మైలురాయిగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీజీ ఏసీబీ & సీఐడీ శ్రీమతి చారుసిన్హా, డీఐజీలు నవీన్ కుమార్, నారాయణ నాయక్, పరిమళ హనా నూతన్, ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, సీఐడీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments