ఇంట్లో తల్లిదండ్రులు తరచూ మందలించడంతో మనస్తాపానికి గురైన ముగ్గురు మైనర్ బాలికలు ఇళ్ల నుంచి వెళ్లిపోయిన ఘటనలో మైలార్‌దేవపల్లి పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి 24 గంటల్లోనే వారిని సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.
సాంకేతిక నిఘా, రైల్వే పోలీసుల సమన్వయంతో మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్‌లో దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్న బాలికలను గుర్తించి రక్షించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం..
జూలై 24న కాటేదాన్ నుంచి బుద్వేల్ రైల్వే స్టేషన్‌కు ఆటోలో చేరుకున్న ముగ్గురు బాలికలు అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లి ఢిల్లీ వెళ్లే దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలును ఎక్కారు. జూలై 25న బాలికల్లో ఒకరి తల్లి మైలార్‌దేవపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో రాజేంద్రనగర్ జోన్ డీసీపీ పర్యవేక్షణలో పోలీసులు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా సీసీటీవీ దృశ్యాలను పరిశీలించడంతో పాటు బాలికల్లో ఒకరు రహస్యంగా తీసుకెళ్లిన మొబైల్ ఫోన్ ద్వారా వినియోగిస్తున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను గుర్తించారు. ఆ ఖాతాకు అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను సాంకేతికంగా ట్రేస్ చేసి, వారు దక్షిణ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లు నిర్ధారించారు.
అనంతరం రైలు కోచ్, సీటు వివరాలను గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో మధ్యప్రదేశ్‌లోని బీనా రైల్వే స్టేషన్‌లో రైలును నిలిపివేసి ముగ్గురు బాలికలను క్షేమంగా రక్షించారు. అనంతరం వారిని హైదరాబాద్‌కు తీసుకువచ్చి చట్టపరమైన ప్రక్రియలు, కౌన్సెలింగ్ పూర్తి చేసిన తర్వాత వారి తల్లిదండ్రులకు అప్పగించారు.
ఈ సందర్భంగా పిల్లలతో తల్లిదండ్రులు నిరంతరం మాట్లాడాలని, వారి భావోద్వేగాలను అర్థం చేసుకుని సమస్యలను పరిష్కరించాలని పోలీసులు సూచించారు.
అలాగే పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై పర్యవేక్షణతో పాటు అత్యవసర పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన పెద్దలను ఆశ్రయించేలా వారికి అవగాహన కల్పించాలని కోరారు.
