నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులకు పరిపాలనా, ఆర్థిక అనుమతులు త్వరితగతిన మంజూరు చేసి, ఇప్పటికే ఆమోదం పొందిన పనులను వేగవంతం చేయాలని ఎంపీ అర్వింద్ ధర్మపురి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు.
మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన.. పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు రైల్వే ప్రాజెక్టులపై వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నవీపేట రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) మంజూరు చేయడంతో పాటు, డిచ్‌పల్లి రైల్వే క్రాసింగ్ వద్ద రోడ్డు అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) నిర్మాణాన్ని చేపట్టాలని కోరారు.
ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు నివారించి ప్రయాణికుల భద్రత మరింత మెరుగుపడుతుందని ఎంపీ వివరించారు. ఈ ప్రతిపాదనలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు. సంబంధిత అధికారులతో ప్రతిపాదనలను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
అదేవిధంగా ఇటీవల ఇందల్వాయి, జానకంపేట వద్ద నూతన రోడ్డు ఓవర్ బ్రిడ్జిలు మంజూరు చేసినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ ధర్మపురి కృతజ్ఞతలు తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి, ప్రయాణికుల భద్రత, రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎంపీ పేర్కొన్నారు.
