సర్టిఫికెట్లు ఉన్నా ‘స్కిల్డ్’ గుర్తింపు లేదంటూ నిరసననగరాన్ని వెలుగులతో నింపుతున్న తమకు మాత్రం వేతనాల్లో చీకట్లే మిగిలాయని నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ స్ట్రీట్‌లైట్ ఎలక్ట్రీషియన్లు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్నా తమ సేవలకు తగిన గుర్తింపు, వేతనం లభించడం లేదని ఆరోపిస్తూ శనివారం ధర్నా చౌక్ లో అవుట్ సోర్సింగ్ స్ట్రీట్ లైట్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు. వారు మాట్లాడుతూ.
మున్సిపల్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ విభాగం, అర్బన్ జోన్ల పరిధిలో దాదాపు 20 ఏళ్లుగా ఔట్‌సోర్సింగ్ ఎలక్ట్రీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నామని కార్మికులు తెలిపారు. నగరంలోని వీధిదీపాల నిర్వహణ, మరమ్మతులు, విద్యుత్ సంబంధిత పనులను నిరంతరం చేస్తున్నామని పేర్కొన్నారు.
ఇంతకాలం పనిచేసినా తమను నాన్-పీహెచ్ కేటగిరీలోనే పరిగణించడం వల్ల తగిన వేతనం అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 60, 63 ప్రకారం ఎలక్ట్రీషియన్ కేటగిరీకి రూ.19,500 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ విధులు, బాధ్యతలు, సాంకేతిక నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని వేతనాన్ని సవరించాలని కోరారు.
ఇతర కేటగిరీలకు వర్తించే వేతన విధానాన్ని తమకూ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఎలక్ట్రీషియన్ సర్టిఫికెట్లు ఉన్నాయని, అయినప్పటికీ కార్పొరేషన్ పరిధిలో సర్టిఫికెట్ లేదనే కారణంతో స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించడం లేదని కార్మికులు తెలిపారు. తమ విద్యార్హతలు, సాంకేతిక ధ్రువపత్రాలను పరిశీలించి అర్హత ఉన్న వారిని స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని కోరారు.
తదనుగుణంగా వేతనాలను పెంచాలని విజ్ఞప్తి చేశారు. తమ సమస్యలను అధికారులు సానుకూలంగా పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. నగరంలోని వీధిదీపాల నిర్వహణలో కీలకంగా పనిచేస్తున్న తమ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కోరారు.
నిరసన కార్యక్రమంలో ఔట్‌సోర్సింగ్ స్ట్రీట్ లైట్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సింగరాపు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బెల్లాల్ శంకర్, ప్రధాన కార్యదర్శి షేక్ అక్బర్, సంయుక్త కార్యదర్శి మల్కాయి శ్యామ్, కోశాధికారి ఏల రాజేశ్వర్, కార్యవర్గ సభ్యులు, ఔట్‌సోర్సింగ్ ఎలక్ట్రీషియన్లు పాల్గొన్నారు.
