ఈ నెల 21న జరగనున్న ‘నీట్ రీ-ఎగ్జామినేషన్’ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్షన్ 163 బీఎన్‌ఎస్‌ఎస్ అమలు చేయనున్నట్లు నిజామాబాద్ ఇంచార్జి పోలీస్ కమిషనర్ (కామారెడ్డి జిల్లా ఎస్పీ) రాజేష్ చంద్ర వెల్లడించారు.
పరీక్షా కేంద్రాల వద్ద జూన్ 21న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉంటాయని సీపీ తెలిపారు. ఆ సమయంలో పరీక్షా కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో ఇద్దరికంటే ఎక్కువ మంది గుంపులుగా చేరడాన్ని నిషేధించారు.
విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, పరీక్షా కేంద్రాల సమీపంలోని ఇంటర్నెట్ సెంటర్లు, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది.
పరీక్షా కేంద్రాల వద్ద అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ప్రతి కేంద్రం వద్ద పోలీస్ అధికారులతో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని సీపీ పేర్కొన్నారు.
నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి, ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.
పరీక్షా కేంద్రాల జాబితా: 1. గిరిరాజ్ ప్రభుత్వ కాలేజీ (అటానమస్), నిజామాబాద్. 2. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్, డిచ్‌పల్లి. 3. యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డిచ్‌పల్లి. 4. ప్రభుత్వ జూనియర్ కాలేజీ, బోధన్. 5. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, బోధన్. 6. ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, నిజామాబాద్. 7. శ్రీ బిగాల కృష్ణమూర్తి జెడ్పీహెచ్‌ఎస్, మాక్లూర్. 8. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీ ఫర్ గర్ల్స్-1, నాగారం, నిజామాబాద్.
