గత రాత్రి కురిసిన భారీ వర్షానికి కళ్యాణి వాగు ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కురిసిన భారీ వర్షానికి ప్రాజెక్టులో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఉన్న కళ్యాణి ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరుతుంది.
బుధవారం ఉదయం ప్రాజెక్టు అధికారులు రెండు రేడియల్ గేట్ల ద్వారా 250 క్యూసెక్కులు మంజీరా నదిలోకి వదులుతున్నారు. 180 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రాజెక్టు ప్రధాన కాలువలోకి మళ్ళించారు. ప్రాజెక్టులోకి 430 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 409.5 మీటర్లు కాగా ప్రస్తుతం 408.6 మీటర్ల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.
ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో పెరుగుతే మంజీరా నదిలోకి వదిలే నీటిని పెంచుతామని, ఇన్ఫ్లో ఆగిపోతే ప్రాజెక్టు రేడియల్ గేట్లు మూసివేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఎల్లారెడ్డి పట్టణంలో గత రాత్రి వర్షపాతం 65.4 మిల్లీమీటర్లుగా నమోదు అయింది..
