సదాశివనగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తృప్తిలో తప్పింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న ఏకధాటి వర్షాలకు ఆసుపత్రి ఆవరణలోని ఓ భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. ఈ ప్రమాదంలో ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ (ఎం ఓ) కారు పూర్తిగా ధ్వంసమైంది.
భారీ వృక్షం అకస్మాత్తుగా మెడికల్ ఆఫీసర్ కారుపై పడటంతో వాహనం ధ్వంసం అయింది. చెట్టు కూలిన సమయంలో ఆ ప్రాంతంలో రోగులు గానీ, ఆసుపత్రి సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
పెద్ద ప్రమాదం తప్పడంతో డాక్టర్, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం కూలిన చెట్టును తొలగించే క్రమంలో ఆసుపత్రి ప్రధాన గేటు సైతం ధ్వంసమైంది.
ఆసుపత్రి ఆవరణలో ఉన్న పలు పెద్ద వృక్షాలు కూలేందుకు సిద్ధంగా ఉండటంతో గత ఏడాదే ‘హాస్పిటల్ మేనేజ్‌మెంట్ కమిటీ’ సమావేశంలో వాటిని తొలగించాలని, ఆసుపత్రికి మరమ్మతులు చేపట్టాలని తీర్మానించారు.
అయితే, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాకపోవడంతో ఆ తీర్మానాలు కాగితాలకే పరిమితమయ్యాయి.
