ఒకప్పుడు క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ, ఇప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. వరుస ఘటనలు, ఉన్నతాధికారుల అహంకారపూరిత ధోరణి, చివరకు ఏసీబీ వలలో అవినీతి తిమింగలాలు చిక్కడంతో ఈ శాఖ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శాఖలో నెలకొన్న అరాచక పరిస్థితులపై ప్రజలు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ ఎక్సైజ్ చరిత్రలో కానిస్టేబుల్ సౌమ్య మృతి ఒక చేదు జ్ఞాపకం. విధి నిర్వహణలో భాగంగా తనిఖీలు చేస్తుండగా, నిర్మల్‌కు చెందిన స్మగ్లర్లు ఆమెపై కారుతో దాడి చేసి పొట్టన పెట్టుకున్నారు.
ఆ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సౌమ్యకు న్యాయం జరగాలని తోటి సిబ్బంది పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టినా, ఆ తర్వాత శాఖలో వ్యవస్థ మెరుగుపడకపోగా, మరింతగా వివాదాల్లోకి నెట్టబడటం గమనార్హం. శాఖలో ఉన్నతాధికారుల తీరుపై సొంత సిబ్బందే బాహాటంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఉన్నతాధికారిని ఉద్దేశించి చేసిన దుర్భాషలు, అనుచిత వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర కలకలం రేపాయి.
ఆ అధికారి వేధింపులు భరించలేక మనస్తాపానికి గురైన సిబ్బంది ఏకంగా రాజీనామా బాట పట్టేంత వరకు పరిస్థితులు దిగజారాయి. ఉన్నత స్థానాల్లో ఉండాల్సిన వారే ఇలా వ్యవహరించడం పట్ల శాఖా పరమైన క్రమశిక్షణ ఎక్కడ ఉందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ఏసీబీకి పట్టుబడటం ఈ శాఖలోని అవినీతికి నిలువుటద్దం.
ఆయన అక్రమ ఆస్తులపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు, దాడి చేయగా ఏకంగా మూడు కోట్ల రూపాయలకు పైగా అక్రమాస్తులు బయటపడటం సంచలనం సృష్టించింది. ప్రతి కల్లు బట్టి నుంచి, గొలుసు దుకాణాల నుంచి నెలనెలా మామూళ్లు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
గతంలో కూడా పలువురు కల్లు డిపోల వారితో గొడవలకు దిగడం, వివాదాల్లో నిలవడం మల్లారెడ్డికి అలవాటుగా మారిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుదీర్ఘకాలంగా ఏసీబీ నిఘా ఉంచిన తర్వాతే, ఆయన బాగోతాలను బయటకు తీసి, అదుపులోకి తీసుకోవడం ఎక్సైజ్ శాఖలోని ‘మాయాజాలాన్ని’ బయటపెట్టింది.
ఒకవైపు సిబ్బంది ప్రాణాలకు రక్షణ లేకపోవడం, మరోవైపు అధికారులు అవినీతికి పాల్పడటం, ఇంకోవైపు తోటి వారిని వేధించడం.. ఇలా నిజామాబాద్ ఎక్సైజ్ శాఖ అస్తవ్యస్తంగా మారింది.
