HomeCRIMEమద్యం మత్తులో వాహనం నడిపితే జైలు ఖాయం నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య

మద్యం మత్తులో వాహనం నడిపితే జైలు ఖాయం నిజామాబాద్ సీపీ పి. సాయి చైతన్య

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గత రెండు వారాల్లోనే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 426 మంది పట్టుబడగా, వారికి కోర్టులు రూ. 41,60,000 జరిమానా విధించాయి.

ఈ నెల 15 నుంచి 27 వరకు నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ డివిజన్లు, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 426 మందిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు.

వీరందరినీ నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ కోర్టుల్లో హాజరుపరచగా, 10 మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష పడింది. మిగిలిన వారికి భారీ మొత్తంలో జరిమానాలు విధించినట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రాణాలకే ప్రమాదమని సీపీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు.

మోటార్ వెహికల్ యాక్ట్ (సవరణ – 2019) ప్రకారం.. మొదటిసారి మద్యం తాగి పట్టుబడితే రూ. 10,000 జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష, రెండోసారి పట్టుబడితే రూ. 15,000 జరిమానా లేదా జైలు శిక్ష పడుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడిన వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను 6 నెలల పాటు సస్పెండ్ చేస్తాం.

మద్యం తాగి ప్రమాదానికి గురైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ లభించదు. మైనర్లు మద్యం తాగి వాహనాలు నడిపితే, వారితో పాటు వాహన యజమానిపై కూడా ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాం. ఇలాంటి సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

వాహనదారులు తమ వెంట వాహనానికి సంబంధించిన పత్రాలను ఎల్లప్పుడూ ఉంచుకోవాలి.నిబంధనలను అతిక్రమించి మళ్లీ మళ్లీ మద్యం తాగి పట్టుబడే వారికి కఠినమైన జైలు శిక్షలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments