అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని బసవ గార్డెన్‌లో తైక్వాండో క్రీడాకారులకు కలర్ బెల్ట్‌లు మరియు సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మరియు కోచ్ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
బెల్ట్ ప్రమోషన్ పరీక్షల్లో అర్హత సాధించిన సుమారు 150 మంది క్రీడాకారులకు వివిధ స్థాయిల కలర్ బెల్ట్‌లు, సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు, బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా అధ్యక్షులు బసవ లక్ష్మీనరసయ్య , నిజామాబాద్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య , జిల్లా యువజన మరియు క్రీడల అధికారి పవన్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు అభినందనీయులని పేర్కొన్నారు. క్రీడలు పిల్లల్లో శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ప్రతిరోజూ క్రీడా మైదానంలో సాధన చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవనశైలితో పాటు విద్యా రంగంలో కూడా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
మొబైల్ ఫోన్లు, టెలివిజన్ మరియు ఇతర డిజిటల్ వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల్లో పాల్గొనడం ద్వారా పిల్లల భవిష్యత్తు మరింత ఉజ్వలంగా మారుతుందని పేర్కొన్నారు. విద్యతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులకు సూచించారు.
జిల్లాలో తైక్వాండో క్రీడాభివృద్ధికి విశేష కృషి చేస్తూ యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తున్న అమేచూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు బసవ లక్ష్మీనరసయ్య సేవలను కోచ్ మనోజ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించారు.
ఈ కార్యక్రమంలో కోచ్‌లు గంగాధర్, నాగరాజ్, శివకుమార్, నితిన్, సిద్ధార్థ, గోపీకృష్ణ పాల్గొని విద్యార్థులకు బెల్ట్‌లు, సర్టిఫికెట్లు అందజేశారు. క్రీడాకారులు, తల్లిదండ్రులు, క్రీడాభిమానులు మరియు పలువురు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
