వేల్పూర్ మండల పరిధిలో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న ట్రాన్స్‌ఫార్మర్ల కాపర్ దొంగతనాల కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ చోరీలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను ఆర్మూర్‌కు చెందిన వారిగా గుర్తించి, వారిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల నుంచి సుమారు రూ. 2 లక్షల విలువైన కాపర్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.వేల్పూర్ మండలంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి, అందులోని విలువైన కాపర్ తీగలను అపహరిస్తున్న ఘటనలు పెరిగిపోవడంతో రైతులు, విద్యుత్ శాఖ అధికారులు ఆందోళన చెందారు.
దీనిపై ప్రత్యేక నిఘా పెట్టిన పోలీసులు, సాంకేతిక ఆధారాలు మరియు సమాచారం మేరకు ఆర్మూర్ కేంద్రంగా పనిచేస్తున్న ఆరుగురు వ్యక్తుల ముఠాను గుర్తించి పట్టుకున్నారు.అరెస్టు చేసిన నిందితులను విచారిస్తున్న పోలీసులకు మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిసినట్లు సమాచారం.
ఈ ముఠాతో పాటు ఇంకా ఎవరైనా ఇందులో భాగస్వాములు ఉన్నారా? వీరికి ఎవరైనా సహకరిస్తున్నారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అలాగే, వీరు గతంలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి చోరీలకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ముఠా నెట్‌వర్క్ ఎక్కడి వరకు విస్తరించి ఉంది, ఈ కాపర్ వైర్లను వీరు ఎవరికి విక్రయిస్తున్నారు అనే విషయాలపై పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు.
