వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న అక్కసుతో, సొంత భర్తనే అత్యంత కిరాతకంగా అంతం చేసిందో కసాయి భార్య. ప్రియుడితో కలిసి పథకం ప్రకారం భర్తను హతమార్చి, అది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది.
నిజామాబాద్ శివారులోని న్యాల్కల్ పరిధిలో వెలుగుచూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. న్యాల్కల్కు చెందిన ప్రశాంత్, కుటుంబ పోషణ కోసం కొన్నాళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వలస వెళ్లాడు. ఈ క్రమంలో అతని భార్య సంధ్య ఇక్కడే ఉంటోంది.
ఈ సమయంలో ఆమెకు అనిల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడగా, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ తిరిగొచ్చాడు. భార్య తీరుపై అనుమానం రావడంతో విషయం తెలుసుకున్న అతను, ఆమెను తీవ్రంగా మందలించాడు.
భవిష్యత్తులో ఇలాంటి పనులు మానుకోవాలని హెచ్చరించాడు. భర్త తన అక్రమ సంబంధానికి అడ్డుపడుతున్నాడని గ్రహించిన సంధ్య, అతన్ని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. పథకం ప్రకారం, ప్రశాంత్‌కు విపరీతంగా మద్యం తాగించి మత్తులోకి జారుకునేలా చేసింది. ఆ వెంటనే తన ప్రియుడు అనిల్‌ను ఇంటికి పిలిపించింది.
ఇద్దరూ కలిసి ప్రశాంత్‌పై తీవ్రంగా దాడి చేసి, భవనం పై నుంచి కిందకు తోసేశారు. ప్రశాంత్ అదృష్టవశాత్తూ ఆ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో, నిందితులు మరింత అఘాయిత్యానికి పాల్పడ్డారు. అత్యంత దారుణంగా హార్పిక్ లిక్విడ్‌ను సిరంజిలోకి తీసుకుని, అతని నరాల్లోకి ఎక్కించారు. దీనివల్ల ప్రశాంత్ కొద్దిసేపటికే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనను ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా నమ్మించేందుకు సంధ్య నాటకాలు ఆడింది.
ప్రశాంత్ మృతిపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు, మృతదేహాన్ని పరిశీలించగా అసలు విషయం బయటపడింది. వైద్య పరీక్షల్లో నరాల్లో హార్పిక్ ఉన్నట్లు తేలడంతో విచారణను వేగవంతం చేశారు. పోలీసుల కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
విచారణ లో పోలీసుల ముందు సంధ్య, అనిల్ నేరాన్ని అంగీకరించారు. వీరిద్దరితో పాటు హత్యకు సహకరించిన మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
