భారతీయ సమాజంలో జాతీయవాద భావజాలాన్ని పెంపొందించడమే లక్ష్యంగా న్యాయవాద పరిషత్ అవిరళంగా కృషి చేస్తోందని హైకోర్టు న్యాయవాది, న్యాయవాద పరిషత్ రాష్ట్ర కోశాధికారి మంగులాల్ పేర్కొన్నారు.
శుక్రవారం నిజామాబాద్ జిల్లా న్యాయవాద పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో చట్టాల ప్రక్షాళన జరిగిందని తెలిపారు. వలసపాలన నాటి ఇండియన్ పీనల్ కోడ్ (, ఎవిడెన్స్ యాక్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ మూలాలున్న కొత్త చట్టాలను తీసుకురావడం అభినందనీయమన్నారు.
భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనే ఈ మూడు చట్టాలు దేశ గొప్పతనాన్ని, న్యాయ వ్యవస్థలోని స్వయంప్రతిపత్తిని ప్రపంచానికి చాటిచెబుతున్నాయి. ప్రతి రంగంలోనూ భారతీయతను ప్రతిబింబించేలా చేయడం పరిషత్ ప్రధాన ఉద్దేశ్యం” అని ఆయన వివరించారు.
జిల్లా న్యాయవాద పరిషత్ అధ్యక్షులు మల్లెపూల జగన్ మోహన్ గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు న్యాయవాదుల సంక్షేమం కోసం, సామాజిక బాధ్యతతో పరిషత్ పనిచేస్తుందని తెలిపారు. న్యాయవాదులకు నిరంతరం న్యాయ విజ్ఞానాన్ని అందించడంలో తమ సంస్థ ముందుంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో న్యాయవాద పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి కృష్ణానంద్, జిల్లా కార్యదర్శి డి. నరేందర్ రెడ్డి, సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేధార్, సాయిరెడ్డి, గంగా ప్రసాద్, సుదర్శన్ రెడ్డి, మాణిక్ రాజు, విగ్నేష్, బిట్ల రవి, మద్దేపల్లి శంకర్, ఉదయ కృష్ణ, పిల్లి శ్రీకాంత్, శరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
