నగరంలోని నాందేవ్‌వాడలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆషాఢమాస వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా సాగాయి. అమ్మవారికి నిర్వహించిన మహాగంగా జలాభిషేకం కార్యక్రమానికి భక్తులు, ముఖ్యంగా మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
ఉదయం 8 గంటలకు శ్రీ విఠలేశ్వర మందిరం నుంచి సువాసినులచే అమ్మవారికి ప్రత్యేక జలాభిషేకం కోసం గంగా జలాన్ని తీసుకుని ఆలయం వరకు వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తుల జయజయధ్వానాలు, మేళతాళాలతో నాందేవ్‌వాడ వీధులు పునీతమయ్యాయి.
ఉదయం 10 గంటలకు అమ్మవారికి అత్యంత భక్తిపూర్వకంగా మహాగంగా జలాభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని నూతన వస్త్రాలతో అలంకరించి, భక్తులకు కనువిందు చేసేలా మహా హారతి ఇచ్చారు.
తదనంతరం నిర్వహించిన సామూహిక కుంకుమార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. మధ్యాహ్నం 1 గంటకు భక్తులకు మహా అన్న ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం లలితా సహస్రనామ పారాయణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.
అనంతరం అమ్మవారికి పల్లకి సేవ, భజన కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి మహిళలు పాల్గొనడంతో ఆలయం భక్తి భావంతో శోభిల్లింది. ఈ ఊరేగింపులో పాల్గొన్న సువాసినులు ఘటములను భక్తిపూర్వకంగా స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ అధ్యక్షులు పాల్ల్తి రవికుమార్, సెక్రెటరీ రాఘవేందర్, ప్రముఖ ఆర్యవైశ్య నాయకులు కసుబ సంపత్ కుమార్ గుప్తా, ఆలయ కమిటీ సభ్యులు మరియు సువాసినులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
