ఆస్తి సంబంధిత రెండు వేర్వేరు కేసులను ఆదిబట్ల పోలీసులు ఛేదించారు. ఒక కేసులో అంతర్రాష్ట్ర ఇంటి దొంగను, మరో కేసులో వరుస బైక్ చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి భారీ మొత్తంలో ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఈ వివరాలను ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి శనివారం మీడియాకు వెల్లడించారు. మొదటి కేసులో రాజస్థాన్ రాష్ట్రంలోని పాలి జిల్లా జుజావర్ గ్రామానికి చెందిన ముఖేష్ చౌదరి (35) ప్రస్తుతం కేపీహెచ్‌బీలోని సాయిరామ్ బాయ్స్ హాస్టల్‌లో ఉంటూ జొమాటో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు.
గతంలో యాప్రాల్‌లో హార్డ్‌వేర్ దుకాణం నిర్వహించిన అతడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిబట్ల క్రైమ్ సిబ్బంది తుర్కాయంజల్‌లోని మన్నెగూడ వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు.విచారణలో ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో నమోదైన క్రైమ్ నెం.607/2026, బీఎన్‌ఎస్ సెక్షన్లు 331(4), 305 కింద నమోదైన ఇంటి దొంగతనం కేసుతో పాటు మరో ఆరు కేసుల్లోనూ నేరాలు చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఆదిబట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు, హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నాలుగు, కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఒకటి చొప్పున మొత్తం ఏడు కేసుల్లో నిందితుడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. గతంలో ఇతడిపై 17 కేసులు నమోదై ఉండగా, ఐదు పోలీస్‌స్టేషన్ల పరిధిలో రిమాండ్‌కు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడి వద్ద నుంచి మూడు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి ఆభరణాలు, ఒక సెల్‌ఫోన్, ఒక హీరో గ్లామర్ మోటార్‌సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. వీటి మొత్తం విలువ రూ.6.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.
మరో కేసులో హైదరాబాద్ డీడీ, సీసీఎస్ క్రైమ్ టీమ్‌తో కలిసి ఆదిబట్ల పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో సయ్యద్ ఖాసిం హుస్సేన్, దబీర్‌పురా, మహమ్మద్ కరీం బండ్లగూడలను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో నిందితుడు షేక్ సల్మాన్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
సయ్యద్ ఖాసిం హుస్సేన్‌పై గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఐదు కేసులు నమోదైనట్లు వెల్లడించారు. విచారణలో నిందితులు వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీలకు పాల్పడినట్లు అంగీకరించారని తెలిపారు.
వారి వద్ద నుంచి మొత్తం ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసుల దర్యాప్తు అదనపు సీపీ (క్రైమ్స్) శ్రీనివాస్, ఐపీఎస్, శంషాబాద్ జోన్ డీసీపీ బి.రాజేష్, ఆదిబట్ల డివిజన్ ఏసీపీ ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఆదిబట్ల ఎస్‌హెచ్‌వో ఎస్.రమేష్, డీఎస్‌ఐ ఎన్.నోయల్‌రాజ్ పర్యవేక్షణలో సాగింది. కేసులను ఛేదించడంలో కీలకపాత్ర పోషించిన ఆదిబట్ల క్రైమ్ టీమ్ సిబ్బంది ఎల్.రవికుమార్, ఆర్.కిరణ్‌రెడ్డి, యెల్లయ్య, ఉపేందర్‌రెడ్డి, సందీప్, శివచంద్ర, కె.సంతోష్‌కుమార్, ఎం.డి.సంతోష్‌కుమార్, సీహెచ్.భరత్‌కుమార్ గౌడ్తో పాటు సీసీఎస్ జోనల్ క్రైమ్ టీమ్ సిబ్బందిని డీసీపీ బి.రాజేష్ అభినందించారు.
