నందిపేట మండలంలోని ఉమ్మెడ వద్ద గురువారం చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. లోకేశ్వరానికి చెందిన భోజవ్వ నందిపేటకు వెళ్లేందుకు లోకేశ్వరం నుంచి ఉమ్మెడ వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగా, గుర్తుతెలియని వ్యక్తి ఆమెను ఎక్కడికి వెళ్తున్నారని ఆరా తీశాడు.
నందిపేట వైపు వెళ్తున్నానని చెప్పి తన ద్విచక్ర వాహనంపై ఎక్కించుకున్నాడు.కొద్దిదూరం వెళ్లిన అనంతరం వాహనాన్ని మరో మార్గంలోకి మళ్లించడంతో భోజవ్వ అనుమానం వ్యక్తం చేసి ప్రశ్నించింది.
దీంతో నిందితుడు ఆమెను అక్కడే దించి కొంతదూరం వెళ్లాడు. అనంతరం తిరిగి వచ్చి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు చైన్‌ను లాక్కొని ద్విచక్ర వాహనంపై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నందిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
