నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండటంపై కలెక్టర్ భవేష్ మిశ్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. ఆసుపత్రి పరిసరాలు, ఆవరణను పరిశీలించారు.
పలుచోట్ల డ్రైనేజీ పైప్లైన్లు లీకవుతుండటం, మురుగునీరు నిలిచిపోవడం, దుర్గంధం వెదజల్లుతుండటాన్ని గుర్తించారు. ఎనిమిది అంతస్తుల భవన సముదాయంగా ఉన్న జీజీహెచ్‌లో నిర్వహణ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు, సిబ్బంది అనారోగ్యానికి గురయ్యే పరిస్థితులు లేకుండా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి లోపల, బయట ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు.
ఆవరణలోని ఓపెన్ డ్రైనేజీలకు పైకప్పు ఏర్పాటు చేయాలని, మురుగునీరు నిల్వ కాకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని సూచించారు. పారిశుధ్య సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణ చేపట్టాలని నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్‌కు సూచించారు.
చెత్తాచెదారం ఎక్కడా పేరుకుపోకుండా రోజువారీగా తొలగించేలా పర్యవేక్షణ ఉండాలన్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో పేరుకుపోయిన వృథా నిర్మాణ సామగ్రిని వెంటనే తొలగించాలని, గుంతలమయంగా మారిన అంతర్గత రహదారులకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు.
కుక్కలు, పశువులు ఆసుపత్రి ఆవరణలోకి రాకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించారు. పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యానికి తావులేకుండా నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ వి.భుజంగరావు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఇతర అధికారులు ఉన్నారు.
