చిన్నారులపై లైంగిక నేరాలకు సంబంధించిన పోక్సో కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు.
ఆదివారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో పోక్సో కేసుల దర్యాప్తు, పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన పోక్సో కేసులను ఒక్కొక్కటిగా పరిశీలించిన కమిషనర్.. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు, నిందితుల గుర్తింపు, అరెస్టులు, సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, బాధిత చిన్నారుల వాంగ్మూలాలు, కేసుల ప్రస్తుత స్థితిగతులపై అధికారులను ఆరా తీశారు.
పెండింగ్‌లో ఉన్న అంశాలను గుర్తించి వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. పోక్సో కేసుల్లో బాధిత చిన్నారుల భద్రత, గోప్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ స్పష్టం చేశారు. బాధితుల పట్ల సున్నితంగా వ్యవహరించడంతోపాటు దర్యాప్తులో శాస్త్రీయ ఆధారాల సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఎఫ్‌ఎస్‌ఎల్ పరీక్షలు, మెడికల్ ఎగ్జామినేషన్లను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయించాలని సూచించారు.కేసులకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, ఇతర సాంకేతిక ఆధారాలను నిబంధనల ప్రకారం సేకరించి దర్యాప్తులో సమర్థంగా వినియోగించాలని తెలిపారు.
సాక్షుల వాంగ్మూలాలు, ఇతర కీలక ఆధారాలను పకడ్బందీగా నమోదు చేసి కేసులు కోర్టులో బలంగా నిలిచేలా దర్యాప్తు చేయాలని సూచించారు. ఎఫ్‌ఎస్‌ఎల్, మెడికల్ తదితర నివేదికలు అందిన వెంటనే చార్జిషీట్ దాఖలు చేసేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశించారు.
పోక్సో కేసుల చార్జిషీట్ ఫైలింగ్‌లో అనవసర జాప్యం ఉండకూడదని, సాధ్యమైనంత తక్కువ సమయంలో దర్యాప్తు పూర్తి చేసి న్యాయస్థానంలో చార్జిషీట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు.
పెండింగ్‌లో ఉన్న ప్రతి పోక్సో కేసును సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, దర్యాప్తులో ఎదురయ్యే సాంకేతిక, పరిపాలనా సమస్యలను వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
చిన్నారులపై లైంగిక నేరాల విషయంలో పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుందని, నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడేలా వేగవంతమైన, శాస్త్రీయ, నాణ్యమైన దర్యాప్తు చేపట్టడమే లక్ష్యమని కమిషనర్ స్పష్టం చేశారు.
సమావేశంలో డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ ఏసీపీలు ప్రకాష్ యాదవ్, వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్లు శ్రీధర్‌రెడ్డి, మల్లేషం, సీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ ఆర్. అంజయ్య, సీఐలు, ఐటీ కోర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
