బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు దళితుల పట్ల కపట ప్రేమ చూపిస్తూ ఒకే దారిలో పయనిస్తున్నాయని టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇందిరాశోభన్ విమర్శించారు. రాబోయే రోజుల్లో ఈ రెండు పార్టీలకు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కాట్పల్లి నగేశ్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో దళితులను అనేక రకాలుగా మోసం చేసిందని ఇందిరాశోభన్ ఆరోపించారు.
ఇప్పుడు బీజేపీ కూడా దళితులపై కపట ప్రేమను ప్రదర్శిస్తోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు పార్టీలు ఒకే దొరనీతితో ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పాలన, ఆ పార్టీ వ్యవహారశైలిని ప్రజలకు వివరించాలని కాంగ్రెస్ శ్రేణులకు సూచించారు.
కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి హాజరుకాకుండా ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు దాదాపు రూ.24 కోట్లు ఖర్చు చేశారని, వెయ్యి రోజుల పాలనలో కేవలం మూడు రోజులు మాత్రమే అసెంబ్లీకి వచ్చారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండేదని, కేసీఆర్ పాలనలో తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు చెల్లిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు.అసెంబ్లీ సమావేశాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం, మహిళా పోలీసుల ఎదుట చొక్కాలు విప్పి ప్రవర్తించడం సరికాదన్నారు.
తెలంగాణ సమాజం ఇలాంటి చర్యలను క్షమించదని పేర్కొన్నారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మిలను అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తోందని ఆరోపించారు.ఈ సమావేశంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శరత్, రత్నాకర్‌గౌడ్, గాదారి గోపి, ప్రధాన కార్యదర్శులు ప్రవీణ్‌గౌడ్, బున్నే రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
