తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ మార్పు వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తీర్పును శుక్రవారానికి వాయిదా వేసింది. ఆయనను శాసనసభ సభ్యత్వం నుంచి అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి
. అనంతరం చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్ ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ తర్వాత కాంగ్రెస్‌లో చేరిన విషయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు గండ్ర మోహన్‌రావు, కే. వివేక్‌రెడ్డి వాదనలు వినిపించారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న సమయంలోనే కాంగ్రెస్ బీ-ఫారంతో సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి దానం నాగేందర్ పోటీ చేయడం పార్టీ ఫిరాయింపునకు ముఖ్యమైన ఆధారమని వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
బీఆర్ఎస్కు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సభలో వ్యవహరించిన తీరును మాత్రమే ఆధారంగా చేసుకుని ఫిరాయింపుపై నిర్ణయం తీసుకోవాలన్న స్పీకర్ వైఖరి సరికాదని వాదించారు. స్పీకర్ నిర్ణయం కూడా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని తెలిపారు. దానం నాగేందర్ తరఫు న్యాయవాది ఈ వాదనలను వ్యతిరేకించారు.
ఆయన బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించలేదని తెలిపారు. శాసనసభ రికార్డుల్లో ఇప్పటికీ దానం నాగేందర్ బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని పేర్కొన్నారు.కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన శాసనసభ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దవుతుందని చెప్పలేమని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.
దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ గతంలో స్పీకర్‌ను ఆశ్రయించిన పిటిషన్లను ఆయన కొట్టివేశారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసి, శుక్రవారం వెలువరించనున్నట్లు తెలిపింది.
