అర్ధరాత్రి వేళ బుల్లెట్ బైక్‌కు నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ అమర్చుకుని రోడ్లపై తిరుగుతున్న వ్యక్తికి బాల్కొండ పోలీసులు చెక్ పెట్టారు. భారీ శబ్దంతో బైక్‌ను నడుపుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగించడంతో పాటు పబ్లిక్ న్యూసెన్స్‌కు కారణమవుతున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బైక్‌ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. రాత్రి సమయంలో బుల్లెట్ బైక్ నుంచి వస్తున్న పెద్ద శబ్దంపై పోలీసుల దృష్టి పడింది. దీంతో వాహనాన్ని ఆపి పరిశీలించగా.. సాధారణ సైలెన్సర్‌కు బదులుగా అధిక శబ్దం వచ్చేలా మార్చిన సైలెన్సర్ ఉన్నట్లు గుర్తించారు. ప్రజలు నిద్రించే సమయంలో శబ్దంతో ఇబ్బందులు కలిగించేలా వాహనం నడిపినందుకు చర్యలు తీసుకున్నారు.
వాహనాలకు అధిక శబ్దం వచ్చేలా సైలెన్సర్లను మార్చుకోవడం నిబంధనలకు విరుద్ధమని పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ముఖ్యంగా రాత్రివేళల్లో ఇలాంటి వాహనాలతో తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సైలెన్సర్లు అమర్చిన వాహనాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో భాగంగా శబ్ద కాలుష్యంపై పోలీసులు దృష్టి సారించారని తెలిపారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని సూచించారు.
