నగరంలో ప్రజా సౌకర్యాల పేరుతో ఏర్పాటు చేసిన మరుగుదొడ్ల నిర్వహణ తీరు ప్రశ్నార్థకంగా మారింది. ఒక్కో మరుగుదొడ్డికి ప్రతినెలా రూ.1,200 చొప్పున నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా.. పలుచోట్ల కనీస శుభ్రత, నీటి వసతి, పారిశుద్ధ్య నిర్వహణ కనిపించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నిధులు మాత్రం క్రమం తప్పకుండా వస్తున్నాయని చెబుతున్నా.. మరుగుదొడ్ల పరిస్థితి మాత్రం రోజురోజుకూ దిగజారుతోంది. దీంతో నిర్వహణకు కేటాయిస్తున్న ప్రజాధనం ఏ మేరకు వినియోగమవుతోందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరుగుదొడ్ల నిర్వహణ బాధ్యతలను కాంట్రాక్టర్లకు అప్పగించినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించాల్సిన బాధ్యత మాత్రం మున్సిపల్ యంత్రాంగంపైనే ఉంటుంది. అయితే పలుచోట్ల మరుగుదొడ్లలో నీరు లేకపోవడం, శుభ్రత కొరవడటం, దుర్వాసన వెదజల్లడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.
నిర్వహణకు నిధులు అందుతున్నా వాటికి తగ్గ సేవలు అందడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రజా మరుగుదొడ్ల నిర్వహణను క్లస్టర్లుగా విభజించి వివిధ కాంట్రాక్టర్లకు అప్పగించారు. క్లస్టర్–1లో 28, క్లస్టర్–2లో 30, క్లస్టర్–3లో 44, క్లస్టర్–4లో 41.. ఈ నాలుగు క్లస్టర్లలోనే 143 మరుగుదొడ్లు ఉన్నాయి.
నగరంలోని మిగిలిన క్లస్టర్లలోనూ ఇదే తరహాలో ప్రజా మరుగుదొడ్లు ఉన్నాయి. ప్రతినెలా నిర్వహణకు నిధులు విడుదలవుతున్నప్పుడు వాటితో శుభ్రత, నీరు, పారిశుద్ధ్య సామగ్రి వంటి కనీస వసతులు కల్పించాల్సి ఉంటుంది.
కానీ పలుచోట్ల ఆ పరిస్థితి కనిపించకపోవడంతో కాంట్రాక్టర్లు నిర్వహణ నిధులను సక్రమంగా వినియోగించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం విడుదల చేస్తున్న మొత్తానికి, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులకు మధ్య పొంతన ఉందా? అన్నదానిపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ప్రజా మరుగుదొడ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసి నిర్వహణ లోపాలను గుర్తించాల్సిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, జవాన్ల పర్యవేక్షణపైనా ప్రశ్నలు వస్తున్నాయి. కాంట్రాక్టర్లు నిబంధనలు పాటిస్తున్నారా నిర్వహణ నిధులు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారు.
మరుగుదొడ్లకు ప్రతిరోజూ శుభ్రత పనులు జరుగుతున్నాయా? అన్నది అధికారులు పరిశీలించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే పర్యవేక్షణ కొరవడినట్లు స్పష్టమవుతోందని నగరవాసులు పేర్కొంటున్నారు.
ప్రజల సౌకర్యం కోసం ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్నా వాటి ఫలితం ప్రజలకు అందకపోతే ఆ నిధుల ఉద్దేశమే ప్రశ్నార్థకమవుతుంది.
నగరంలోని అన్ని ప్రజా మరుగుదొడ్లపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిర్వహణ నిధుల వినియోగంపై లెక్కలు పరిశీలించాలని, నిబంధనలు పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.
