గణేష్ నిమజ్జన శోభాయాత్రలో 8 అడుగులకు మించిన విగ్రహాలను తరలించే వాహనాలకు ప్రత్యేక మార్గాన్ని నిర్దేశించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు.
జాన్కంపేట వద్ద బ్రాడ్‌గేజ్ రైల్వే హైటెన్షన్ విద్యుత్ లైన్ ఉన్నందున.. 8 అడుగులకు మించిన ఎత్తు కలిగిన విగ్రహాల వాహనాలను ఆ మార్గంలో అనుమతించబోమని స్పష్టం చేశారు. నిమజ్జన ప్రక్రియ ఆలస్యం కాకుండా, ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు గణేష్ మండళ్ల నిర్వాహకులు, భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు.
8 అడుగుల లోపు విగ్రహాలకు పాత మార్గమే: 8 అడుగుల లోపు ఎత్తు ఉన్న గణేష్ విగ్రహాలు పాత మార్గంలోనే తరలించుకోవచ్చు. నెహ్రూపార్కు, అర్సాపల్లి, జాన్కంపేట, నవీపేట మీదుగా బాసరకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది.
ఎత్తైన విగ్రహాలకు ప్రత్యేక మార్గం: 8 అడుగులకు మించిన విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలు పూలాంగ్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా, రైల్వే స్టేషన్, బస్టాండ్, రైల్వే ఓవర్‌బ్రిడ్జి, శివాజీచౌక్, దుబ్బ, జీజీ కళాశాల చౌరస్తా, బైపాస్ రోడ్డు, డీఎస్ చౌరస్తా, ముబారక్‌నగర్, మాణిక్‌బండార్, దాస్‌నగర్, మాక్లూర్ మీదుగా వెళ్లాలి. అక్కడి నుంచి నందిపేట మీదుగా ఉమ్మెడ గ్రామ సరిహద్దులోని గోదావరి వంతెనకు లేదా నవీపేట మీదుగా బాసర గోదావరి వంతెనకు చేరుకోవచ్చని పోలీసులు సూచించారు.
పాతనగర ప్రాంతాలకు ఇదే మార్గం: గాజులపేట, శివాజీనగర్, గోల్హనుమాన్, అంగడిబజార్, ఎల్లమ్మగుట్ట, పూలాంగ్, రాజారాజేంద్ర చౌరస్తా పరిసరాలు, సాయినగర్, గాయత్రినగర్, కోటగల్లి, హౌసింగ్‌బోర్డు, బోర్గాం, న్యాల్కల్, నాగారం తదితర ప్రాంతాల నుంచి 8 అడుగులకు మించిన విగ్రహాలను తరలించే నిర్వాహకులు ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని వినియోగించుకోవాలని పోలీసులు సూచించారు.
శోభాయాత్ర, నిమజ్జనం ఆలస్యం కాకుండా భక్తి వాతావరణంలో విజయవంతంగా నిర్వహించేందుకు నిర్వాహకులు, భక్తులు, ప్రజలు సంబంధిత పోలీసు సిబ్బందికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.
