ధాన్యం కొనుగోళ్ల నుంచి ఎరువుల విక్రయాల వరకు.. హమాలీ చార్జీల నుంచి నిర్వహణ వ్యయాల దాకా..సొసైటీ లెక్కల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై స్వతంత్ర థర్డ్‌పార్టీతో విచారణ చేపట్టాలని సొసైటీ వైస్ చైర్మన్ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.
గత ఐదేళ్ల నుంచి పదేళ్ల వరకు ఆర్థిక లావాదేవీలపై ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఐలాపూర్ సొసైటీ పరిధిలో నందిపేట, వెల్మల్, ఐలాపూర్, కంఠం, ఆంధ్రనగర్, రైతుఫారం, జోజిపేట తదితర గ్రామాల నుంచి ప్రతి పంట సీజన్‌లో సుమారు 4.40 లక్షల బస్తాల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఈ కొనుగోళ్లకు సంబంధించి రైతులకు చేసిన చెల్లింపులు, హమాలీ చార్జీలు, రవాణా ఖర్చులు, సొసైటీ ఖాతాల్లో నమోదైన మొత్తాలను గ్రామాలు, సీజన్ల వారీగా పరిశీలించాలని కోరారు. హమాలీలకు చెల్లించిన మొత్తానికి, రైతుల నుంచి వసూలు చేసిన మొత్తానికి మధ్య వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు.
ప్రతి బస్తాకు వాస్తవంగా ఎంత చెల్లించారు? రైతుల నుంచి ఎంత వసూలు చేశారు? ఆ మొత్తాలు సొసైటీ లెక్కల్లో ఎలా నమోదయ్యాయి? అనే అంశాలను రసీదులు, వౌచర్లు, బ్యాంకు లావాదేవీలతో సరిపోల్చాలని కోరారు. బస్తా/క్వింటాల్ ప్రాతిపదికన అదనపు వసూళ్ల ద్వారా ఐదేళ్లలో సుమారు రూ.70 లక్షల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు.
సొసైటీ నిర్వహణ ఖర్చుల పేరుతో భారీ మొత్తాలు వెచ్చించినట్లు లెక్కల్లో చూపించారన్న ఆరోపణలపైనా విచారణ జరపాలని కోరారు. ప్రతి బిల్లు, వౌచర్, రసీదు, చెక్, బ్యాంకు స్టేట్‌మెంట్‌ను పరిశీలించి వాస్తవంగా ఖర్చు జరిగిందా లేదా నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు.
గత ఆడిట్లలోనూ కొన్ని అంశాలు వెలుగులోకి రాకుండా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో పాత ఆడిట్ నివేదికలు, అభ్యంతరాలు, వాటికి ఇచ్చిన సమాధానాలను తిరిగి పరిశీలించాలని కోరారు. ఎరువుల కొనుగోలు, విక్రయాలపై ప్రత్యేక తనిఖీ చేయాలని కోరారు. స్టాక్ రిజిస్టర్లు, కొనుగోలు బిల్లులు, అమ్మకాల రిజిస్టర్లు, రైతులకు జారీ చేసిన బిల్లులు, స్టాక్ బ్యాలెన్స్, నగదు, బ్యాంకు జమలను పరస్పరం సరిపోల్చాలని పేర్కొన్నారు.
రికార్డుల్లో ఉన్న నిల్వలకు, వాస్తవ నిల్వలకు మధ్య వ్యత్యాసం ఉందా అన్నదీ తేల్చాలని కోరారు. విచారణ పూర్తయ్యే వరకు సొసైటీకి సంబంధించిన రిజిస్టర్లు, వౌచర్లు, బిల్లులు, బ్యాంకు, డిజిటల్ రికార్డులను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
విచారణలో ఆర్థిక అవకతవకలు లేదా నిధుల దుర్వినియోగం నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతోపాటు సొసైటీకి జరిగిన నష్టాన్ని నిబంధనల ప్రకారం రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇది వ్యక్తిగత వివాదంగా కాకుండా రైతుల ప్రయోజనాలకు సంబంధించిన అంశంగా పరిగణించి స్వతంత్ర విచారణకు ఆదేశించాలని కోరారు. రికార్డులు, ఖాతాలు, బ్యాంకు లావాదేవీలను సమగ్రంగా పరిశీలిస్తేనే ఆరోపణల్లో వాస్తవమెంత అన్నది తేలుతుందని పేర్కొన్నారు. సొసైటీ ఆర్థిక వ్యవహారాల్లో పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
